కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నా, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, బీజేపీ ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ రెండు జాతీయ పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారు. అందుకే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తరు.
– కేటీఆర్
హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీజేపీ బలం గాలివాటమేనని, గతంలోనూ బలం లేదని, భవిష్యత్తులో కూడా క్షేత్రస్థాయి బలం రాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏనాటికీ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని చెప్పారు. 24నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేండ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లో ఆదివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సీనియర్ నేతలకు వివరించారు. కేటీఆర్‌తో పాటు పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాలపైన పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే తెలంగాణ భవన్లో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలతాప్రేమ్గౌడ్, వారి అనుచరులు బీఆర్ఎస్లో చేరగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ వారికి గులాబీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Ktr
కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే పోటీ
పార్లమెంట్ ఎన్నికల నాటికి, ఇప్పటికి రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ దాదాపుగా పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో పోటీ ముమ్మాటికీ కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ మధ్యే ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదలు పంచాయతీ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. పదేండ్లలో కష్టపడి, ఇష్టపడి రాష్ర్టాన్ని బాగుచేసుకున్నామని, నాడు చేసిన మంచి పనులు, అమలు చేసిన అద్భుత పథకాల వల్లే ప్రజలు కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్‌ను చూడగానే ఎనలేని ధైర్యం తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చేసిన అధికార దుర్వినియోగం, చెప్పిన తప్పుడు లెకలు అన్నీ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతాయని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు
ఆరు గ్యారెంటీలను గారడీగా మార్చి ప్రజలను ఏమార్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అభివృద్ధి కనుమరుగైందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని, రియల్ ఎస్టేట్ రంగం దివాలా తీసిందని, పేదల బతుకు దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు భూముల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి వారు నిశ్చింతగా ఉండేవారని, కానీ కాంగ్రెస్ పాలనలో ధరలు పడిపోవడంతో మళ్లీ అనిశ్చిత పరిస్థితుల మధ్య ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
స్పీకర్ వద్ద బీఆర్ఎస్.. ప్రజల వద్ద కాంగ్రెస్
రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. స్పీకర్ వద్దకు పోయేమో బీఆర్ఎస్లో ఉన్నామని అంటున్నారని.. నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పేరు చెప్పుకొని తిరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. వారికి దమ్మూ ధైర్యముంటే డ్రామాలు బంద్‌పెట్టి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధంకావాలని సవాల్ విసిరారు. స్పష్టంచేశారు.
నిరుద్యోగులకు భరోసానివ్వాలి
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి వారిని నట్టేటా ముంచారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. హామీలు అమలు చేయాలని అడిగితే పోలీసులతో వారిపై దాడి చేయించడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి అన్ని సిద్ధం చేస్తే సీఎం మాత్రం తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ‘నిజంగా ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమే అయితే ఇటీవల అశోక్‌నగర్‌లో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు పోలీసుల బలగాల మధ్య ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నిరుద్యోగులపై లాఠీలు ఝులిపించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
బల్దియాలపై గులాబీ జెండా ఎగురవేయాలి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలని కేటీఆర్ ఉద్బోధించారు. పార్టీ నుంచి ఎవరూ పోటీచేసినా భేషజాలను వీడి గెలుపునకు సహకరించాలని కోరారు. గడపగడపకూ వెళ్లి రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టాలని సూచించారు. రాత్రింబవళ్లు శ్రమించి బల్దియాలు, జడ్పీలపై గులాబీ జెండాను ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అన్నింటా ముందు నిలిపి సబ్బండ జనుల బతుకుల్లో కేసీఆర్ పాలనలో వెలుగులు నింపితే.. ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధపు హామీలిచ్చి అన్నివర్గాలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయి. మోసం చేసేవారినే ప్రజలు నమ్ముతారని.. నాడు చెప్పినట్టే ఇప్పుడు అచ్చంగా తెలంగాణ ప్రజలను చీకట్లోకి నెట్టేశాడు. రేవంత్‌రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు.
– కేటీఆర్
అన్నగా నిలిచి.. కన్నీళ్లు తుడిచి!
రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణభవన్‌లో ఆదివారం కనిపించిన భావోద్వేగ దృశ్యమిది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తమను వేధిస్తున్నారంటూ చేరికల సందర్భంగా యాదగిరిగౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లుపెట్టుకోగా.. కేటీఆర్ ఓదార్చారు. ఆయన కన్నీళ్లు తుడిచారు. ‘భయపెట్టాలె తప్ప.. భయపడొద్దు! నీకు అండగా మేమున్నం!’ అని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో బీజేపీకి బలం లేదు. రెండే
ండ్ల క్రితం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గాలివాటమే. అప్పుడు దేశంలోని రాజకీయ పరిస్థితులు ద్విధృవంగా మారడం, ఎప్పుడూ లేని ఒక విభిన్న పరిస్థితి ఏర్పడటం వల్ల గెలిచింది తప్ప.. తెలంగాణలో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో అసలు బలం లేదు. గతంలోనూ ఆ పార్టీకి బలం లేదు.. భవిష్యత్తులో కూడా రాబోదు.
– కేటీఆర్