హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ (BRS) కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం’ అనే నినాదంతో హైడ్రా (HYDRAA) అరాచకాలపై ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT), ఫొటో ఎగ్జిబిషన్ ఆహూతులను ఆలోచింపజేసింది. నగరంలో పేదల ఇండ్లు, గుడిసెలు, చిరువ్యాపారుల దుకాణాలపై హైడ్రా బుల్డోజర్లు సాగించిన అరాచకం, దాష్టీకాన్ని కేటీఆర్ ఇచ్చిన పీపీటీ కండ్లకు కట్టింది. పుస్తకాల కోసం చిన్నారుల ఏడుపులు, వారి మోముపై కన్నీటి చారలు కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు అద్దం పట్టాయి.
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో హైడ్రా పేరుతో సాగించిన కూల్చివేతల పర్వాన్ని ఫొటో ఎగ్జిబిషన్ చిత్రీకరించింది. గృహ ప్రవేశం చేసిన మరుసటి రోజే ఇంటిని కూల్చడం, మామిడి తోరణాలు, గుమ్మం వద్ద కట్టిన గుమ్మడి కాయ వాడకపోవడం, పుస్తకాల కోసం చిన్నారుల ఆక్రందన, కష్టార్జితంతో కట్టిన కలలసౌధం కండ్ల ముందే కూల్చితే తట్టుకోలేక రోదిస్తున్న ఇంటి యాజమాని నిస్సహాయత వంటి ఫొటోలు అందరి కండ్లను చెమ్మగిల్లేలా చేశాయి. అదే వరుసలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి చెందిన పెద్ద విల్లాలు, భారీ సౌధాలు దర్జాగా ఉన్న ఫొటోలు, హైడ్రా వాటి జోలికి వెళ్లకపోవడం వంటి ఫొటోలు ఎగ్జిబిషన్‌కు వచ్చిన హైడ్రా బాధితులను ఆలోచింపజేశాయి.
‘పేదల ఇండ్ల మీదకు బుల్డోజర్లను పంపిస్తున్న పాలకులకు, హైడ్రా అధికారులకు పెద్ద సౌధాలు కనిపించడం లేదా? ఎందుకు పేదలపై ఇంత కక్ష?’ అని హైడ్రా బాధితులు చర్చించుకోవడం కనిపించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో హైడ్రా సాగించిన కూల్చివేతలు, ఆ సందర్భంలో అధికారుల కఠిన చర్యలు, పెద్దల విషయంతో ఉదాసీనతపై కేటీఆర్ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో కాంగ్రెస్ సర్కారుపై హైడ్రా బాధితులు ఒక అంచనాకు వచ్చినట్టు వారి మాటల్లో అర్థమైంది.