KTR | దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అడవి సంపద చుట్టూ అందమైన పచ్చని పందిరి అల్లిన ప్రకృతి ప్రేమికుడు కేసీఆర్ అని ప్రశంసించారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు చేసిన కృషిని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వివరించారు.
ఆనాడు తెలంగాణలో హరితహారం మహోద్యమంలా సాగిందని.. 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పంతో ముందుకెళ్లామని కేటీఆర్ సూచించారు. అది ప్రపంచ చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమని పేర్కొన్నారు. సుమారు 15 వేల నర్సరీల పెంపకం మహాయజ్ఞంలో సరికొత్త అధ్యాయమని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రీన్ కవర్ 8 శాతం పెరిగిందని.. అది దేశ చరిత్రలోనే నెవర్ బిఫోర్ అని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే.. ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు.. చిక్కిశల్యమైన అడవులను.. సకల జీవరాశులను సంరక్షించడమని.. నలుదిశలా చాటిచెప్పిన నాయకత్వం మనది పేర్కొన్నారు.
దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను
కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు..
కేసీఅర్ గారు..సమైక్య రాష్ట్రంలో..
ఆగమైన అడవిసంపద చుట్టూ..
అందమైన పచ్చని పందిరి అల్లిన..
ప్రకృతి ప్రేమికుడు కేసీఅర్ గారు..తెలంగాణలో మహోద్యమంలా
సాగిన ఆనాటి హరితహారం…
230 కోట్ల మొక్కలు నాటాలన్న… pic.twitter.com/LRyBcoxbyH— KTR (@KTRBRS) March 21, 2024
అందుకే బీఆర్ఎస్ పదేళ్ల ప్రస్థానం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణమని అన్నారు. నాడు ప్రతి పల్లె పచ్చదనంతో మురిసిందని.. ప్రతి పట్నం హరిత శోభతో వెల్లివిరిసిందని అన్నారు. అదే నేడు గ్లోబల్ వార్మింగ్‌తో మానవాళికి వార్నింగ్‌లు.. ఎటుచూసినా క్లౌడ్ బస్టులు… కుండపోతల ప్రమాదఘంటికలు మోగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రకృతి విపత్తులను అరికట్టాలన్నా.. పర్యావరణ సమతుల్యత సాధించాలన్నా.. ఆపదలో ఉన్న ఆటవీసంపద కాపాడాలన్నా.. మానవజాతి చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం హరితహారం అని పేర్కొన్నారు. నాడు.. నేడు.. ఏనాడైనా బీఆర్ఎస్ నమ్మే సిద్ధాంతమిదే అని స్పష్టం చేశారు. అందుకే జంగిల్ బచావో.. జంగిల్ బడావో.. నినాదాన్ని నాటి సీఎం కేసీఆర్ అక్షరాలా నిజం చేశారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు మనమిచ్చే వారసత్వ సంపద.. కాంక్రీట్ జంగిళ్లు కానే కాదని.. పచ్చని అటవీ సంపద అని చాటిచెప్పి.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా నిర్మించిన.. గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ సాక్షిగా.. ప్రకృతి ప్రేమికులందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.