హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా గుర్తుండిపోయే పోరాట రూపాల్లో సాగరహారం ఒకటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ఆంక్షలను, ముండ్ల కంచెలను ఎదురించి, నిర్బంధాలను ఛేదించి, రబ్బర్ బుల్లెట్లకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమకారులు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన ఉద్వేగభరిత ఘట్టం సాగరహారం అని గుర్తుచేశారు. ‘ఉద్యమకారులను అడ్డుకుందామన్న సమైక్య పాలకుల కుట్రలను పటాపంచలు చేస్తూ.. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ‘జై తెలంగాణ’ అని గొంతెత్తి, కవాతు చేస్తూ ఉద్యమస్ఫూర్తిని చాటిన ఉద్విగ్న సందర్భం సాగరహారం. నేటితో సాగరహారానికి 13 ఏండ్లు. జై తెలంగాణ’ అని మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ ఉద్యమాభివందనాలు ; హరీశ్‌రావు
తూటాలకు భయపడకుండా పోరాడిన ఉద్యమకారుల ధైర్యసాహసానికి నిదర్శనమే సాగరహారమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మహత్తర ఘట్టానికి 13 ఏండ్లు నిండాయని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు అన్నివర్గాలు ఏకతాటిపైకి వచ్చి గొంతెత్తి నినదించిన రోజులు ఎన్నటికీ మరువలేమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచి, స్వరాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యమాభివందనాలు అని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు.