ఇందిరమ్మ రాజ్యమంటే ఆటోడ్రైవర్ల ఉసురు తీయడం..పేదల ఇండ్లు కూలగొట్టడం..అందరి బతుకులు ఆగం చేయడమేనా? రేవంత్‌రెడ్డీ? కేసీఆర్ హయాంలో రంది లేకుండా బతుకెళ్లదీసిన ఆటోవాలాలు కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో రోడ్డున పడ్డరు. -కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమసే ్తతెలంగాణ): మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు నలిగిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. ప్రతినెలా రూ.వెయ్యి భృతి ఇస్తామని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చి మోసం చేయడంతో రెండేండ్లలో 161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అసెంబ్లీలో అడిగితే తప్పించుకుంటున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెచ్చిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని ఎత్తేసి మోసం చేసిందని నిప్పులు చెరిగారు. నాడు డీజిల్ ధరలు పెంచి పన్నుల రూపంలో మోదీ, కేసీఆర్ ప్రజలను దోచుకుతింటున్నారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా డీజిల్ ధరలను ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు.
సోమవారం ఆయన జూబ్లీహిల్స్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించి ఆటోడ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తాను ప్రయాణించిన ఆటో డ్రైవర్ మస్రత్అలీ ఆటోవాలాల దయనీయ పరిస్థితులను వివరించారని చెప్పారు. గతంలో ఆయనకు రెండు ఆటోలు ఉండేవని, ఒకటికి కిరాయికి ఇచ్చి మరోటి సొంతంగా నడుపుకొనేవాడని తెలిపారు. గతంలో రాహుల్‌గాంధీ కూడా ఆయన అద్దెకిచ్చిన ఆటోలో ప్రయాణించి అనేక హామీలు గుప్పించిన విషయాన్ని మస్రత్ అలీ చెప్పారని వివరించారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని వాపోయారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రోజుకు రూ. 2500 సంపాదించి రంది లేకుండా బతుకెళ్లదీసిన మస్రత్.. ఇప్పుడు ఉన్న ఆటోలను అమ్మి కిరాయి ఆటో నడుపుతూ కేవలం రోజుకు రూ.600 సంపాదిస్తూ బతుకుబండీ లాగిస్తున్నాడని చెప్పారు. రాష్ట్రంలోని అందరు ఆటోడ్రైవర్ల పరిస్థితి ఇంచుమించు ఇదేవిధంగా ఉన్నదని చెప్పారు.
ఓట్ల కోసం ఉద్దెర హామీలు
నాడు ఓట్ల కోసం ఉద్దెర హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి..ఇప్పుడు ఎగనామం పెట్టి ఓటేసిన ప్రజలను నిలువునా ముంచుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని, ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ఖాతాల్లో జమచేస్తామని, బిడ్డ పెండ్లి చేస్తే తులం బంగారం పెడతామని అరచేతిలో స్వర్గం చూపి ఇప్పుడు ఖజానాలో పైసల్లేవని సాకులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లకు రూ. 24,000, ఆడబిడ్డలకు రూ. 60,000, వృద్ధులకు రూ.48,000 చొప్పున కాంగ్రెస్ సర్కారు బాకీ పడ్డదని చెప్పారు.
సుస్మిత ప్రశ్నలకు సమాధానాలేవి?
పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి, మంత్రులు కమీషన్ల కోసం కుమ్ములాడుకుంటున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మంత్రి ఇంట్లో తలదాచుకున్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్న మంత్రి కూతురు సుష్మిత సీఎం అక్రమ బాగోతాలను బట్టబయలు చేసిందని గుర్తుచేశారు. ‘ఓ సిమెంట్ కంపెనీ డైరెక్టర్‌ను బెదిరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డే గన్ పంపించారు.. ఆయన అనుచరుడు రోహిన్‌రెడ్డే సదరు కంపెనీ డైరెక్టర్ కణతకు గురిపెట్టారు..సీఎం సోదరులు మంచిరేవుల భూములు ఆక్రమించుకొనేందుకు యత్నిస్తున్నారు’ అంటూ సుస్మిత చేసిన ఆరోపణలకు సీఎం ఇప్పటివరకు సమాధానం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. మంత్రి ఓఎస్డీ గన్పెట్టారో, రోహిన్‌రెడ్డి బెదిరించారో గాని మొత్తానికి ఈ దందాల వ్యవహారం నిజమేనని బాహ్యప్రపంచానికి తెలిసిపోయిందని, కానీ పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, కంపెనీ డైరెక్టర్‌ను విచారించకుండా వదిలేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. బస్టాప్‌లలో ఆటోలు పెట్టుకొంటే అమా యకులపై ఫైన్లు విధిస్తూ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే పోలీసులు అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తడం తీవ్ర ఆక్షేపణీయమని మండిపడ్డారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే సీఎం, మంత్రుల అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
కారును పోలిన గుర్తులపై జాగ్రత్త
కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్మూధైర్యంలేక కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. బ్యాలెట్ పేపర్లో కారును పోలిన గుర్తులను పెట్టించి ప్రజలను మోసం చేసేందుకు ఎత్తుగడ వేస్తున్నారని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మూడో నంబర్‌ను చూసి కారు గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తిచేశారు. పొరపాటు చేసి ద్రోహపు పార్టీకి అవకాశం ఇవ్వద్దని అభ్యర్థించారు. ఆటోడ్రైవర్లు, కార్మికులు ఇంటింటికీ వెళ్లి బాకీ కార్డులను పంచి హస్తం పార్టీ మోసాలను ఎండగట్టాలని కోరారు. కేసీఆర్ పాలన తిరిగిరావాలంటే జూబ్లీహిల్స్‌లో సునీతమ్మను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని తేల్చిచెప్పారు.

4 లక్షల ఓటర్లతో 4 కోట్ల మందికి మేలు
జూబ్లీహిల్స్‌లోని నాలుగు లక్షల మంది ఓటర్ల చేతిలో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవితవ్యం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ఇక్కడ ఓటుతో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి ఆ పార్టీ నేతల కండ్లు తెరిపించాలని కోరారు. కాంగ్రెస్‌ను ఓడగొడితేనే రూ.2 వేల పింఛన్‌ను 4 వేలు చేయాలనే, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇవ్వాలనే, ఆటోడ్రైవర్లకు నెలకు వెయ్యి భృతి ఇవ్వాలనే సోయి రేవంత్‌రెడ్డి సర్కారుకు వస్తుందని చెప్పారు. వాళ్ల మాయమాటలు నమ్మితే నట్టేట మునగడం ఖాయమని చెప్పారు. మోసం చేసినా ప్రజలు తమనే నమ్ముతున్నారని భావించి ఉన్న పథకాలను ఎగ్గొట్టే ప్రమాదం ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. నేరచరిత్ర కలిగిన వారికి ఓటేస్తే దందాలు, చందాల వసూలు చేయడం తప్ప ప్రజలకు చేసేదేమీ ఉండదని విమర్శించారు. అందుకే కేసీఆర్ నిలిపిన అభ్యర్థి సునీతమ్మను గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.
బీఆర్ఎస్లోకి ఆటో డ్రైవర్లు, మైనార్టీ నేతలు
తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ పరిధిలోని బోరబండ, షేక్‌పేట, రహ్మత్‌నగర్ ప్రాంతాల ఆటోడ్రైవర్లు, మైనార్టీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరినవారిలో బోరబండకు చెందిన అంజలి, జావేద్, ఫయాజ్, షేక్ అబ్దుల్లా హమీద్, షాఖాన్, అబ్దుల్‌గనీ, హసద్, జహంగీర్, మజీద్, మౌలనా, షాహేద్ సమ్మాన్, పర్వేజ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు మారయ్య పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్లకు కేటీఆర్, హరీశ్ సంఘీభావం
కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంఘీభావం ప్రకటించారు. స్వయంగా ఆటోల్లో ప్రయాణించి వారి సాదకబాధకాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి మస్రత్అలీకి చెందిన కిరాయి ఆటోలో తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి హరీశ్‌రావు ఆటోలో బయల్దేరి తెలంగాణభవన్‌కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. బన్సీలాల్‌పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ ప్రాంతంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వయంగా ఆటోనడిపారు. ఆటోడ్రైవర్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాగ్దానాలను విస్మరించిన కాంగ్రెస్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధిచెప్పాలని కోరారు.
మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాలోత్ కవిత, సుమిత్రా ఆనంద్, సామల హేమ తదితరులు మంత్రులపై ఫిర్యాదు చేసేందుకు ఆటోలో బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్, నేతలు వై సతీశ్‌రెడ్డి, శుభప్రద్‌పటేల్, ఏనుగు రవీందర్, ఫయీం మీర్ రహత్‌అలీ, లక్ష్మణ్‌రావు యూసుఫ్‌గూడ డివిజన్లో ఆటోలో ప్రయాణించారు. డ్రైవర్లు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి శ్రీనగర్, యూసుఫ్‌గూడలో ఆటోలో ప్రయాణించారు.
దండుపాళ్యం బ్యాచ్‌కు బుద్ధిచెప్పాలి
రెండేండ్లుగా దండపాళ్యం ముఠాలా ప్రజలను దోచుకుతిని ఢిల్లీకి మూటలు పంపడంలోనే కాంగ్రెస్ నేతలు మునిగితేలున్నారని, గల్లీలో ఉన్న గరీబోళ్లకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు కూడా రేవంత్‌రెడ్డికి మనసు వత్తలేదని కేటీఆర్ విమర్శించారు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటుకు రెండు, మూడు వేలు పంచి అడ్డదారిలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. దండుపాళ్యం ముఠా దిగి మాయమాటలు చెప్పి ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నదని, ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. వాళ్లు దోచుకున్న డబ్బు ఇస్తే తీసుకొని ఓటు మాత్రం కారుకే వేసి మోసపూరిత కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని అడిగితే కాంగ్రెస్ వాళ్లు ఆహ నా పెళ్లంట సినిమా చూపిస్తున్నరు. ఇంటి గుమ్మానికి కోడిని వేలాడదీసి బిర్యానీ తినుమన్న చందంగా వ్యవహరిస్తున్నరు. కాంగ్రెస్ నేతలు తులం బంగారం ఇచ్చేటోళ్లు కాదు.. మహిళల మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకు పోయేటోళ్లు.
-కేటీఆర్
జూబ్లీహిల్స్‌లోని 4 లక్షల మంది ఓటర్ల చేతిలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవితవ్యం ఉన్నది. ఇక్కడ ఓటుతో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలె. కాంగ్రెస్‌ను ఓడగొడితేనే రూ.2 వేల పింఛన్‌ను 4 వేలు చేయాలనే, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇవ్వాలనే, ఆటోడ్రైవర్లకు నెలకు వెయ్యి భృతి ఇవ్వాలనే సోయి రేవంత్ సర్కారుకు వస్తది.
-కేటీఆర్