KTR | రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘పిల్లల తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దు. గురుకులాల్లో చదువుతున్న ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు తల్లి, తండ్రి అన్నీతానై చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పాముకాటుతో చనిపోయిన అనిరుధ్లాంటి పరిస్థితి ఏతల్లిదండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎనిమిదినెలల్లో రాష్ట్రంలోని గురుకులాల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారని, వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని, ఈ విషయంలో ప్రభుత్వం రాజకీయ భేషజాలకు పోవద్దని సూచించారు. రాష్ట్రంలోని గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనుభవం ఉన్న నాయకుడు, గతంలో గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రభుత్వానికి నిష్పక్షపాతంగా సూచనలతో నివేదిక సమర్పిస్తామని చెప్పారు. నాలుగైదు రోజుల్లో కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 20 సంక్షేమ గురుకులాలను పరిశీలిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాముకాటుతో చనిపోయిన ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన అనిరుధ్ కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు.
కొడుకు మరణంతో విషాదంలో మునిగిన తల్లిదండ్రులు ప్రియాంక, కృష్ణారెడ్డిని కేటీఆర్ ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఎనిమిదినెలల్లో గరుకులాల్లో కలుషిత ఆహారం తిని 500 మంది వరకు దవాఖానల్లో చేరినట్టు తెలిపారు. భువననగిరి, సూర్యాపేటలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. వానకాలం అయినందున గురుకులాలను పరిశుభ్రంగా ఉంచాలని, పాములు, తేళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పెట్టే భోజనంపై కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. గురుకులాలను దత్తత తీసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవని ప్రభుత్వానికి సూచన చేశారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల రాజకీయాలు అసలే వద్దని, మనపిల్లలుగా చూసుకుంటూ వారి ప్రాణాలపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిల్లలు బాగుండాలి, ప్రపంచంతో పోటీ పడాలన్న ఉద్దేశంతో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. గురుకులాలను ఇంటర్, డిగ్రీ కాలేజీలుగా ఆప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. పిల్లలకు ఆహార విషయంలో భరోసా ఇచ్చామని, తాము సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల శాఖ అధ్యక్షుడు వలస కృష్ణహరి, మార్కెట్ మాజీ అధ్యక్షుడు అందె సుభాష్, నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భీమేశ్ పాల్గొన్నారు.