హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో అదానీ అడుగు రాష్ట్రంలో పడనీయలేదని, అదే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రధాని, అదానీ ఒకటేనని విమర్శలు చేసిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకొన్నారని, దీని ద్వారా కాంగ్రెస్, బీజేపీల అసలు రంగు బయటపడిందని అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, వాటిని అమలు చేసేదాకా కాంగ్రెస్‌ను విడిచిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీ నాగ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధానే అని ఎండగట్టి ఇప్పుడు అదే అదానీతో చెట్టాపట్టాల్ వేసుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే
రాష్ట్రంలో బీఆర్ఎస్ బలమైన గొంతుక అని, ప్రజలు బీఆర్ఎస్తో ఉన్నారని గ్రహించి కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తమపై దుష్ప్రచారం చేశాయని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ను బీజేపీ బీ టీం అని ఇరు పార్టీలు గతంలో చేసిన ప్రచారాన్ని ఉదహరించారు. బీజేపీ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రశ్నించదని, అలాగే కాంగ్రెస్‌ను బీజేపీ ప్రశ్నించదని ఉదహరించారు. ఏ పార్టీ ఏ పార్టీకి బీ-టీమో జరుగుతున్న పరిణామాలే కండ్లకు కడుతున్నాయని అన్నారు. బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి ఎవరు ఎవరి టీమో స్పష్టంగా తెలిసిపోతున్నదని చెప్పారు. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే ప్రజలకు స్పష్టత వస్తున్నదని, రాబోయే రోజుల్లో అది మరింత తేటతెల్లం అవుతుందని తెలిపారు.
ఎత్తగొడితే ఎండగట్టండి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు కాదని, అవి మొత్తం 420 అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని, ఎత్తగొడితే బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని ఎక్కడిక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతూ ‘అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా.. 2 లక్షల రుణం తెచ్చుకోండి’ అని చెప్పారని, ఇప్పుడు రుణమాఫీ చేయలేక మాటతప్పారని మండిపడ్డారు.
రైతుల నుంచి రుణా లు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయటమే కాకుండా కేసులు పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి విషయంలో అసెంబ్లీ సాక్షిగా తాము హామీ ఇవ్వలేదని తప్పించుకొన్నారని విమర్శించారు.
సమావేశంలో మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌సహా మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ఆహ్వానిత ప్రతినిధులు పాల్గొన్నారు.
కరోనా సమయంలోనూ రైతుబంధు ఆపలేదు: హరీశ్‌రావు
రైతుల ప్రయోజనాలే పరమావధిగా కేసీఆర్ నిరంతరం తపించారని, కరోనా సమయంలోనూ రైతుబంధును ఆపకుండా వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఉన్న రూ.10వేలను వేయకుండా మోసం చేసిందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. రైతుబంధు విషయంలో కేసీఆర్‌కు, రేవంత్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ముల్లును ముల్లుతోనే తీద్దామని, కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే బీఆర్ఎస్కు ఆయుధమని పేర్కొన్నారు.
కేసీఆర్ పథకాల అమలులో పోటీపడితే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడంలో పోటీపడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కేసులు కొత్తకాదని, న్యాయం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం ఎంతదాకా అయినా పోరాటం చేద్దామని అన్నారు. పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఈ ఓటమి తాత్కాలికమేనని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారని చెప్పారు.
కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు చెప్పాలి
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు విడమరచి చెప్పేందుకు ప్రతీ గులాబీ సైనికుడు పోటీపడాలని హరీశ్‌రావు సూచించారు. కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కై రెండు ఎమ్మెల్సీల నోటిఫికేషన్‌ను వేర్వేరుగా ఇచ్చిందని అన్నారు. అదానీ, ప్రధాని ఒకటేనని ఆరోపించిన రేవంత్‌రెడ్డి అదానీతో ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకొన్నారని ప్రశ్నించారు. తాము పనిని నమ్ముకొంటే కాంగ్రెస్ పార్టీ గోబెల్స్‌ను నమ్ముకున్నదని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడిక్కడ ఎండగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ కార్యకర్తలు కసితో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సింహాల్లా గర్జించాలని పిలుపునిచ్చారు.
చెత్త పోయిందని భావిద్దాం
అక్కడక్కడా పార్టీని వీడేవాళ్ల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోసం బీఆర్ఎస్లో చేరారని, అదే అధికారం కోసం కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారని అలాంటి వారి గురించి పట్టించుకోవద్దని సూచించారు. పార్టీ నుంచి చెత్త వెళ్లిపోతున్నదని భావిద్దామని పేర్కొన్నారు. కష్టమైనా సుఖమైనా, ఆపతి సంపతిలో మనతో ఉండేవాళ్లే మనోళ్లు అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్సే తెలంగాణ గళం
పార్టీ అధినేత కేసీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ సాధించిందని, ఈసారి కూడా అదే చరిత్ర పునరావృతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పదేండ్లలో తెలంగాణ తరుపున గళం విప్పింది బీఆర్ఎస్ ఎంపీలేనని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, తెలంగాణ బలం, గళం, గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలని అన్నారు. లేదంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, జరుగుతున్న పరిణామాలే అందుకు అద్దం పడుతున్నాయని తెలిపారు. ఇదే విషయం ప్రజలకు చెప్పాలని సూచించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కన్నా మెదక్ పార్లమెంట్ పరిధిలో 2 లక్షల 48 వేల ఓట్ల ఆధిక్యత సాధించిదని, ఇందుకు పార్టీ శ్రేణులు చాలా కృషిచేశారని అభినందించారు.