KTR | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం ఇచ్చే బాధ్యత నాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సల్మాన్ ఖాన్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోంది. మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డిదే. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వకుండా అజారుద్దీన్ను బలి చేశారు. సీఎం, మంత్రి మధ్య గొడవలో ఐఏఎస్ అధికారి రిజ్వీని బలి చేశారు. ఒక ఐఏఎస్కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రభుత్వంతో కొట్లాడి ఇప్పిస్తా.. ఒకవేళ ఇవ్వకపోతే, రెండేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు, మొదటి వారంలోనే జీవో తీసుకొచ్చి స్థలం ఇస్తాం. ప్రభుత్వ స్థలం దొరకకపోతే, ప్రైవేట్ స్థలాన్ని కొని అయినా ఇస్తాం. కేసీఆర్ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల శ్మశాన వాటిక కోసం 125 ఎకరాల భూమిని ఇచ్చాం అని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి మిలిటరీకి చెందిన స్థలాన్ని ముస్లిం శ్మశాన వాటికకు ఇచ్చాడు. అది మిలటరీకి చెందిన స్థలమని తెలిసి, అది వాళ్లు గుంజుకుంటారని తెలిసి ముస్లిం ప్రజలను మాయ చేసేందుకు ప్రయత్నించాడు. 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో ముస్లిం ప్రజలు ఇంకా పేద వారిగా ఉన్నారని రాహుల్ గాంధీ బీహార్లో చెప్తాడు. ఆ పేదరికానికి 60 ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? అని కేటీఆర్ నిలదీశారు.