KTR | హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా…? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. అబద్ధపు హామీలు, గారడీ గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెల్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా..? అని ప్రశ్నించారు.
యూరియా దొరకక కళ్లముందే పంట ఎండిపోవడంతో ఆక్రోశంలో మాట్లాడిన రైతుపై కక్షగట్టి అర్థరాత్రి నుంచి పోలీసులను అతని ఇంటిపైకి పంపించి రైతు లక్ష్మణ్‌ను అతని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తారా..? దేశానికే అన్నం పెట్టే రైతుపై ఈ రకంగా అక్రమంగా కేసు బనాయించడం దుర్మార్గమైన చర్యే కాదు.. సీఎం దిగజారుడుతనానికి కూడా నిదర్శనం. ఇందిరమ్మ రాజ్యంలో బస్తా యూరియాకు దిక్కులేక అల్లాడుతున్న అన్నదాతలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా… రాజ్యాంగాన్ని పట్టుకుని ఫోజులు కొట్టే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలె అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పదేళ్లపాటు ఎన్నడూ లేని యూరియా సంక్షోభాన్ని తన చేతకానితనంతో సృష్టించిన రేవంత్‌పై కోపాగ్నితో రగిలిపోతున్న లక్షలాది రైతులపై కేసులు పెట్టే దమ్ము ఈ సర్కారుకు ఉందా..? పల్లెపల్లెనా ఈ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న రైతులందరిని అరెస్టు చేయడానికి ఈ పోలీసులు సరిపోరు. ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవు. కడుపుకాలిన తెలంగాణ రైతులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి, తన పాత గురువును అడిగి తెలుసుకుంటే మంచిది. ఇకనైనా ఈ అక్రమ కేసులు బనాయించి అమాయక రైతు లక్ష్మణ్‌ను వేధించడం మానుకోకపోతే, అతనికి రక్షణ కవచంగా బీఆర్ఎస్ ఉంటది. రాష్ట్రంలోని అన్నదాతలను బీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటది అని కేటీఆర్ తేల్చిచెప్పారు. జై కిసాన్.. జై తెలంగాణ.. అని కేటీఆర్ నినదించారు.
యూరియా అడిగితే
పోలీసులను పంపిన రేవంత్! pic.twitter.com/1RGFgnVKIj— BRS Party (@BRSparty) September 5, 2025