KTR | రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘మంచిగా నడుస్తున్న వస్త్ర, వ్యా పార రంగాన్ని చంపేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి శాడిస్టులా వ్యవహరిస్తున్నది. బతుకమ్మ చీరెల భరోసాతో బతికిన నేతన్నల కుటుంబాలను చిదిమేస్తున్నది. 11 నెలల పాలనలో సిరిసిల్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 34 మంది బలవన్మరణాలకు కారణమైంది. ఇంకెంత మంది చనిపోతే ఈ గవర్నమెంటుకు బుద్ధి వస్తది. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే సిగ్గొస్తది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాను సిరిసిల్లకు ఎమ్మెల్యేగా ఉండటం రేవంత్‌రెడ్డికి ఇబ్బంది అనుకుంటే, తనపై పగ, కోపం ఉంటే, ఎమ్మెల్యేగా ఉన్నందునే నేతన్నల మీద ప్రేమ కలగడం లేదనుకుంటే రేపు ఫస్ట్ అవర్లోనే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
నేతన్నలను మాత్రం ఆదుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని హెచ్చరించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక అప్పుల పాలై శనివారం ఆత్మహత్య చేసుకున్న నేతన్న భైరి అమర్, స్రవంతి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎలగందుల రమణ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆదివారం రాత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. రాజీవ్‌నగర్‌లో ఒగ్గు రాజేశం, నెహ్రూనగర్‌లో పోరండ్ల సదానందం, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ దూస భూమయ్య కుటుంబాలను పరామర్శించి హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు. ‘ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు.
మానవత్వంతో స్పందించాలి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేతన్నలను వెన్నుపోటు పోడవడం వల్ల్లే సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒక్క సిరిసిల్లలోనే 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ కానుకలు, కేసీఆర్ కిట్లు బంద్ పెట్టి ఉపాధి దెబ్బతీస్తూ, నేతన్నల పొట్టకొట్టడం, పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టడం ప్రభుత్వానికి సరికాదని హితవు చెప్పారు. నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చేలా మానవత్వంతో స్పందించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న యువ నేతన్న ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని, వారి కుటుంబానికి రూ.10 లక్షల సాయ ం చేయాలని చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఫోన్ చేసి డిమాండ్ చేశారు.
ఆర్డర్లు ఇచ్చి ఆదుకోండి
పదేండ్ల క్రితం సోలాపూర్ నుంచి సిరిసిల్లకు వలస వచ్చిన అమర్- స్రవంతి దంపతులు బతుకమ్మ చీరలతో నెలకు రూ.20వేలకు పైగా సంపాదించారని కేటీఆర్ తెలిపారు. ఆర్డర్లు బంద్ అయిన తర్వాత సాంచాలు అమ్ముకుని అప్పుల పాలై యువజంట ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఫైనాన్స్‌లో తీసుకున్న అ ప్పు కట్టలేక, ఇల్లు, బండి అన్నీ అమ్ముకుని ముగ్గురు పిల్లలను అనాథలు చేసిన ఘటన బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం మానవత్వంతో ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. నేత, గీత వృత్తిదారులు, కార్మికుల మీద ప్రేమ ఉంటే ఇస్తామన్న 4 వేలు, మహిళలకు రూ 2,500 పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముగ్గురి పిల్లల చదువు బాధ్యత నాదే
ఆత్మహత్య చేసుకున్న అమర్-స్రవంతి దంపతుల ముగ్గురు పిల్లలైన లహరి, శ్రీవల్లి, దీక్షనాథ్ను చదివించే బాధ్యత తనదేనని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వారు డాక్టర్, ఇంజినీర్, లాయర్ ఇలా ఎంత వరకు చదువుతానంటే అంతదాకా చదివిస్తానని చెప్పారు. ముగ్గురి పేర్ల మీద పార్టీ ఫండ్ రూ.2 లక్షల చొప్పున రూ.6 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎలగందుల రమణ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్ దిడ్డి మాధవి, నాయకులు బొల్లి రాంమోహన్, గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.