KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తన అరెస్టుపై కాంగ్రెసోళ్లు రెండేండ్లుగా కలలు కంటూనే ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. చూసి చూసి వాళ్ల కళ్లు కాయలు కాస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఎల్ అండ్ టీ సంస్థపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.
రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుకాల ఓ స్కీమ్ ఉంటది.. దాని వెనుకాల ఓ స్కాం ఉంటుంది. ఇది పక్కా.. ఆయన పేరుకే ముఖ్యమంత్రి కానీ ఆయన దందా బ్లాక్ మెయిల్. ఇవాళ చెప్పింది చిన్న విషయం.. ఇంకో నాలుగైదు రోజుల్లో ఒక పెద్ద విషయం కూడా చెబుతాను. ఇంకో కార్పొరేట్ సంస్థను ఎట్ల బ్లాక్ మెయిల్ చేశాడో అది కూడా చెప్తాను. ఆధారాలతో సహా చెప్తాను అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెసోళ్లు రెండేండ్లుగా కలలు కంటూనే ఉన్నారు. వాళ్ల కళ్లు కాయలు కాస్తున్నాయి. మమ్మల్ని అరెస్టు చేసుకుంటారా.. ఏం చేసుకుంటారో చేస్కోండి.. నేను ఏ తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే.. నేను ఒక మంత్రిగా పదేండ్లు పని చేశాను.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని చెప్పాను. సీఎంను అడిగాను.. ఆయన స్పందించలేదు. ఏసీబీ కేసు ఇద్దరి మీద ఉంది.. మీ కెమెరాల ముందే లైడిటెక్టర్ టెస్ట్ తీసుకుంటా రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే ఆఫర్ ఇస్తున్నా.. నేను తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీకి ధైర్యం ఎక్కువ.. నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆధైర్యం ఉంది. అరెస్టు చేసుకుంటారా..? ఏం చేసుకుంటారో వదిలేయండి. నన్ను అరెస్టు చేస్తే పైశాచిక ఆనందం వస్తుండొచ్చు సీఎం రేవంత్ రెడ్డికి అది కూడా ఒకే. కానీ మేం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం.. 4 వేల పెన్షన్.. తులం బంగారం, స్కూటీ ఇవన్నీ ఇచ్చేదాకా కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉంటాం.. నీవెన్ని డైవర్షన్ గేమ్‌లు ఆడినా మేం వదిలిపెట్టం కాంగ్రెస్ పార్టీని అని కేటీఆర్ తేల్చిచెప్పారు.