KTR | హైదరాబాద్ : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో పరిగి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
మన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ మారారు. ఇక పార్టీ మారిన తర్వాత.. పార్టీ మారినం అని చెప్పుకోవాలి కదా..! ఏ పార్టీలో ఉన్నావ్ అంటే ఈ పార్టీలో ఉన్నా అని చెప్పుకోవాలి. ఇక ఓ వీడియోలో ఏ పార్టీలో ఉన్నావ్ సర్ అని ఓ విలేకరి అడుగుతుంటే ఏ పార్టీలో ఉండాల్నో ఆ పార్టీలోనే ఉన్నా అంటడు ఓ ఎమ్మెల్యే. మీ పిల్లలకు బయటకు పోయి టైమ్‌కు రాకపోతే.. ఫోన్ చేసి అడిగినప్పుడు యేడా ఉండాల్నో అక్కడే ఉన్నా అంటే వాన్ని దవడ మీదికెళ్లి ఒక్కటి సంపుతవ్. ఇంటికి రాగానే దవడ మీద ఓటి సరుస్తామా..? లేదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇక ఈ 20 నెలలో విచిత్రమైన అనుభవాలు చూస్తున్నాం. కాలే యాదయ్య ఏ పార్టీలో ఉన్నడు అని చిన్న పిల్లగాన్ని అడిగినా కాంగ్రెస్‌లో ఉన్నడు అని చెప్తరు. కానీ స్పీకర్‌కు అర్థమైతలేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నడో శోధించి, పరిశోధించి, మళ్లీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట. రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే.. పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్ల తయారైదంటే.. మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే.. మేం బీఆర్ఎస్లోనే ఉన్నామని సుప్రీంకోర్టులో రాస్తున్నారు. మరి నువ్వు కండువా కప్పుకున్నావ్ కదా అంటే ఇది దేవుని కండువా అని అంటున్నరు. అది కాంగ్రెస్ కండువా కాదు అని చెబుతున్నరు. ఇలా 20 నెలలుగా విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది అని కేటీఆర్ విమర్శించారు.
దవడ మీద ఓటి సరుస్తామా లేదా?
పార్టీ మారి విచిత్రమైన చేష్టలు చేస్తున్న ఎమ్మెల్యేలకు @KTRBRS చురకలు 🔥 pic.twitter.com/QxjgKFRn5O
— BRS Party (@BRSparty) August 7, 2025