KTR | నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 60ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం.. ఎవరి కోసం చేశారని ప్రశ్నించారు. పదేళ్లలో సాధించిన ప్రగతి కన్నా పది నెలలో ఏం సాధించిండ్రని ఈ అప్పులు చేశారని నిలదీశారు.
మీ ఆరు గ్యారంటీలు అర్థ గ్యారంటీలుగానే మిగిలి పోయాయని.. అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కట్టినదాని కన్నా కూల్చిందే ఎక్కువ అని.. ఇచ్చిన దానికన్నా లాక్కున్నదే ఎక్కువ అని విమర్శించారు. అర్థం లేని అప్పులు.. ఎక్కే దిగే ఢిల్లీ ఫైట్లు.. ఆదానీ ముందు పొర్లు దండాలు.. ఇదేగా మీ పది నెలల పాలన అని విమర్శించారు. పటిష్టమైన బంగారు రాష్ట్రాన్ని “చేతి”కి అందిస్తే..భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.
328 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.75,118 కోట్ల అప్పు తెచ్చుకున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 72,658 కోట్ల అప్పు తెలంగాణకు గత ప్రభుత్వాల నుంచి సంక్రమించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో వెల్లడించారు. వారి కంటే అధికంగా ఏడాది కూడా గడవకముందే రేవంత్రెడ్డి సర్కారు రూ.2,460 కోట్ల అప్పు అధికంగా చేసింది.
ఒక్క ఆర్బీఐ నుంచే ఆగస్టు 13వ తేదీ నాటికి రూ.42,118 కోట్ల అప్పు చేసిన తెలంగాణ సర్కారు.. ఇలా ప్రతి నెలా రూ.5 వేల నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం అప్పులు తీసుకుంటున్నది. ఇవి కాకుండా వివిధ కార్పొరేషన్లు,స్వయం ప్రతిపత్తి సంస్థలకు ప్రభుత్వం అడ్డగోలుగా గ్యారంటీలు ఇస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర నెలల్లోనే రూ.25 వేల కోట్ల మేర గ్యారంటీలు ఇచ్చింది. ఈ అప్పులను కార్పొరేషన్లు రెండు విధాలుగా చెల్లిస్తాయి. మొదటిది.. పన్నులు, చార్జీల రూపంలో, రెండోది.. ప్రభుత్వమే ఈ మొత్తాన్ని చెల్లించడం. ఎలా చూసినా ప్రజలకే నష్టమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
బీఆర్ఎస్ కంటే చాలా ఎక్కువ
నిరుడు రూ.52,576 కోట్లు అప్పు తీసుకుంటామని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ ఏడాది రేవంత్రెడ్డి సర్కారు అప్పు పద్దు కింద రూ.62 వేల కోట్లు చూపించింది. ఈ ఏడాది రూ.62,012 కోట్లు రుణ సమీకరణ చేయనున్నట్టు బడ్జెట్లో ప్రతిపాదించారు. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర అప్పు పద్దు రూ.10 వేల కోట్లు ఎక్కువ. బహిరంగ మార్కెట్లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1000 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. ఎలాంటి విప్లవాత్మకమైన ప్రాజెక్టులు, పథకాలు చేపట్టకముందే, కనీసం ఏడాదిపాలన ముగియకముందే రికార్డు స్థాయిలో అప్పులు చేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.