KTR | యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గూండా రాజ్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గూండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని విమర్శించారు. దాడులు, గూండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందని అన్నారు..
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పదేళ్లు మేం ఇలాగే చేస్తే పరిస్థితులు ఇట్లా ఉండేవా? : హరీశ్‌రావు
బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని హరీశ్‌రావు తెలిపారు. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. యథా రాజ తథా ప్రజా అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన అని ప్రశ్నించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన… pic.twitter.com/2ulQI5VNfZ
— Harish Rao Thanneeru (@BRSHarish) January 11, 2025
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీకు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా అని కాంగ్రెస్ నాయకులపై హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపైన గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా అని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, ఏడాది కాంగ్రెస్ పాలనలో అశాంతి, అలజడి నెలకొన్నదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని.. తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.