KTR | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే రెండు నివేదికలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి, నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నా, కేవలం కమీషన్ల కోసమే పనులను నిర్వహించిందని కేటీఆర్ అన్నారు. ఆ నివేదికలలో చెప్పిన విధంగానే రెడ్ జోన్ ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎనిమిది కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయయని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ రెండు నివేదికల అంశంపై స్పష్టతను ఇవ్వాలని.. హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజల తరఫున ఈ అంశంపై పూర్తి వివరాలు విడుదల చేయాలని కేటీఆర్ అడిగారు. ఈ ప్రమాదానికి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.