Job Calender | మార్పు మార్పు అంటూ తెలంగాణ ప్రజలను ఎక్కువ రోజులు ఏమార్చలేరని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దమ్ముంటే అశోక్‌నగర్‌కు వచ్చి.. నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పమని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఈ 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని అక్కడ ఉన్న నిరుద్యోగులతో చెప్పించాలన్నారు. అలా చేస్తే మేమందరం రాజీనామా చేస్తామని సవాలు విసిరారు.
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అని కేటీఆర్ అన్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు.. అయినా కూడా పిల్లల్లో ఉద్వేగాల్ని రెచ్చగొట్టేవిధంగా లేని ఒక వాతావరణం నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీ క్యాలెండర్ బోగస్.. అందులో ఉద్యోగాలే లేవు. అందులో తారీఖులు తప్ప ఏమీ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ఫై చర్చ పెట్టమంటే రాష్ట్ర ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. సిగ్గులేకుండా మళ్లీ మా ఎమ్మెల్యేలను సాటి ఎమ్మెల్యేతో ఒక బజారు భాషలో తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి, శాసనభకు చీకటి రోజు అని ఆయన వ్యాఖ్యానించారు.
దుర్మార్గమైన పద్ధతిలో నిన్న, మొన్న మా అక్కల్ని అవమానించారని.. ఇవాళ ఒక సభ్యుడు అమ్మ, అక్క అని తిడుతుంటే శాడిస్టు మాదిరిగా ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతూ అందర్నీ ఉసిగొల్పుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒక శాడిస్టు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తప్పకుండా తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెబుతుందని హెచ్చరించారు.. ఎక్కువ రోజులు డ్రామా నడవదని స్పష్టం చేశారు.
ఈ ఐదారు రోజుల శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. గవర్నమెంట్లో విషయం లేదు.. కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేవని తేలిపోయిందని కాబట్టే ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొడుతున్నారని తెలిపారు. మంచిగా మాట్లాడుతుంటే కావాలనే ఉసిగొల్పి ప్రజల దృష్టి మరల్చే ఒక చీప్ టాక్టిక్స్‌కు చేస్తున్నారని మండిపడ్డారు. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు.. చీప్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. ఒక శాడిస్టు ముఖ్యమంత్రిగా పైశాచిక ఆనందం పొందుతూ.. ఆడబిడ్డలను అవమానిస్తూ.. ఎమ్మెల్యేలను బూతులు తిట్టిస్తూ ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అన్నారు. అందుకే అసెంబ్లీలో నిరసన చెప్పి బయల్దేరి గన్‌పార్క్ వద్దకు వచ్చి.. మా శాసన సభ్యులు, మండలి సభ్యులు అందరం వచ్చి మా నిరసన చెబుతున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని కేటీఆర్ మండిపడ్డారు. ఆ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తూర్పార పడుదామని అనుకున్నామని చెప్పారు. కానీ బజారు భాషలో మాట్లాడేసరికి మా అక్క కోవ లక్ష్మీ దుఃఖం ఆపుకోలేక.. తమను బయటకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ శాసనసభలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు లేవని.. కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు, కాంగ్రెస్ పార్టీ నాటకాలు తప్ప ఏమీ లేవని మండిపడ్డారు. అప్పులు, అప్పులు అని ఇన్ని రోజులు తప్పుడు కూతలు కూశారని చెప్పారు. అప్పులు లేవు.. ఈ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మేం ఎస్టాబ్లిష్ చేస్తే ఇవాళ నోరు మూసుకున్నారని తెలిపారు. అనేక విషయాలను డైవర్ట్ చేయడానికే మా అక్కల మీద నోరుపారేసుకుని.. కావాలని ప్రజల దృష్టి మరల్చే ఓ చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ చిల్లర ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని గ్రహించాలని తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేశారు.