KTR | హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూ కుంభకోణం కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15- 16 నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3డీ మంత్రతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోంది అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న తెలంగాణ రైతన్న కడుపు మీద కొట్టారు. ప్రజల దృష్టి మరల్చి, భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ ప్రభుత్వం పాల్పడింది. హెచ్‌సీయూలో జరిగిన పర్యావరణ విధ్వంసంపై దేశం మొత్తం నివ్వెర పోయి చూసింది. అక్కడ పర్యావరణ విధ్వంసం, మూగజీవుల ప్రాణాలు మాత్రమే తీయలేదు. హెచ్‌సీయూ పక్కన ఉన్న అటవీ భూములను అడ్డం పెట్టుకుని ఒక అతిపెద్ద ఆర్థిక మోసానికి రేవంత్ ప్రభుత్వం పాల్పడింది. ఇదొక నేరపూరిత కుట్ర. తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతుకం. రాత్రికి రాత్రి బుల్డోజర్లను పెట్టి వందల ఎకరాల్లో చెట్లను కూల్చివేసి మూగ జీవాలకు నిలువ నీడ లేకుండా చేసిన రేవంత్ ప్రభుత్వ ఆరాటం వెనుక పదివేల కోట్ల రూపాయల స్కాం ఉంది. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం ఆ 400 ఎకరాలు ముమ్మాటికి అటవీ భూమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు కానీ ఇప్పటిదాకా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమృత్ స్కాంలో రేవంత్ రెడ్డి బావమరిదికి రూ. 1137 కోట్ల రూపాయలు దారి మళ్లించాడని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకోలేదు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే ఇప్పటిదాకా అధికార ప్రకటన రాలేదు. ఈ వ్యవహారాన్ని ఈ ఆర్థిక మోసాన్ని కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటారో.. లేదంటే నిజంగానే సమగ్ర విచారణకు ఆదేశించి మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ దోపిడీని ఉపేక్షించమని చెప్పి కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. దొంగ చేతికి నేను ఇప్పుడే తాళాలు ఎందుకని ఆ బీజేపీ ఎంపీ పేరు చెప్పడం లేదు అని కేటీఆర్ తెలిపారు.
ఈ దేశంలో సామాన్యుడు బ్యాంకు లోన్ తీసుకోవాలంటే 100 డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేసి 100 కొర్రీలు పెట్టి లోన్ ఇస్తారు. అదే ఒక సంపన్నుడు అధికారపక్షంతో అనుబంధం ఉన్నవాడు లోన్ అడిగితే నిమిషాల్లోనే మంజూరు చేస్తారు. కనీసం భూమి ఉందో లేదో కూడా చెక్ చేయరు ఇక్కడ అదే జరిగింది. ఐసిఐసిఐ లాంటి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు, భూ యాజమాన్య హక్కును పరిశీలించకుండానే ఆ భూమి ఎవరిదో తెలుసుకోకుండానే పదివేల కోట్లు లోన్ ఇవ్వడం ఆశ్చర్యం. ఈ భూ కుంభకోణం కర్త కర్మ క్రియ సూత్రధారి పాత్రధారి అంతా రేవంత్ రెడ్డినే. ఇన్ని క్లూస్ ఇచ్చాక జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కేటీఆర్ సూచించారు.