 
                                                            KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో కొన్ని వేల మంది పేదలకు చెందిన ఇండ్లను రేవంత్ రెడ్డి నేలమట్టం చేసిండు.. ఆ పేదల శాపాలు కాంగ్రెస్ పార్టీకి ఉరి తాడై చుట్టుకుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్‌పేట్ డివిజన్లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రసంగించారు.
జీవో నంబర్ 58, 59 కింద హైదరాబాద్ నగరంలో లక్షా 50 వేల మంది పేదలకు కేసీఆర్ పట్టాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు. పేదలను ఆదుకోలేదు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మూడున్నర వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారు కేసీఆర్. లక్ష ఇండ్లు హైదరాబాద్‌లో కట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లైనా కట్టారా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమా..? హైడ్రా పేరు మీద మీ బస్తీల్లోకి బుల్డోజర్లు పంపుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గరీబోళ్ల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపుతున్నారు రేవంత్ రెడ్డి. ఇందిరా గాంధీ గరీబీ హఠావో అని నినాదం చేశారు. ఇవాళ రేవంత్ ఇల్లు లేకుండా బయటకు మెడలు పెట్టి నూకుతున్నాడు. పేదలకు చెందిన కొన్ని వేల ఇండ్లు నేలమట్టం చేసిండు రేవంత్ రెడ్డి. ఆ పేదల శాపాలు కాంగ్రెస్ పార్టికి ఉరి తాడై చుట్టుకుంటాయి అని కేటీఆర్ అన్నారు.
అన్ని రంగాల్లో టాప్‌లో ఉండే తెలంగాణ నేడు దిగజారింది. సంపద సృష్టించండంలో నంబర్ వన్‌లో ఉన్న తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నాశనం చేసిండు. ఆటో అన్నలను దెబ్బతీశారు. 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పరిశ్రమలు పారిపోతున్నాయి. పక్క రాస్ట్రాలకు తరలిపోతున్నాయి. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షల ఉద్యోగాలు ఐటీలో సృష్టించారు. ఇంత అద్భుతంగా కేసీఆర్ పని చేసి నంబర్ వన్ చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ చివరి ర్యాంకులో ఉంది అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
 
                            