KTR | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదు. సిబిఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే 30 శాతం కమిషన్ ఇవ్వండి ఏ పని జరగదని బహిరంగంగానే చెప్తున్నారు. మంత్రులు పైసల్ తీసుకొని పనులు చేస్తారని లేకపోతే ఫైల్స్ కదలవని క్యాబినెట్ సహచరులు మీడియా ముందు బయట పెడుతున్నారు. రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిదని మీడియా ముందు ప్రశ్నిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు 94 వేల కోట్లు ఖర్చు అయితే అందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎలా అంటారు? ఇదంతా అబద్ధమని రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే చెప్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.
ఫ్రస్టేషన్లో రేవంత్ రెడ్డి ఏదేదో చేస్తుంటారు. లీకులు ఇస్తుంటారు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా, ఎన్ని అడ్వటైజ్మెంట్లు తీసుకున్నా రేవంత్ రెడ్డి ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి. తెలంగాణకు పట్టిన రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎలా వదిలించాలన్న దాని పైనే మేము పనిచేస్తున్నాం. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.