KTR | ఖమ్మం : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా కాకుండా కిట్టీ పార్టీ ఆంటీ లాగా వ్యవహరిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు బయటపెట్టే దమ్ము లేక.. చీకట్లో చిట్చాట్ల పేరిట ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
సోషల్ మీడియా రూమర్స్ అడిక్షన్స్ కూడా రేవంత్ రెడ్డికి పట్టుకున్నాయి. ఓ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో డబ్బున్న మహిళలు మధ్యాహ్నం కిట్టి పార్టీలు చేసుకుంటుంటారు. రేవంత్ రెడ్డి కూడా కిట్టి పార్టీ ఆంటీలాగా వ్యవహరిస్తున్నాడు. ఎవడో ఎక్కడో చెప్పింది విని అదే నిజమనుకుని భ్రమించి, మళ్లీ ఓ పది మందిని పోగేసుకుని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. దమ్ముంటే మగాడివి అయితే బయటకు వచ్చి ఆధారం బయటపెట్టు. నువ్వే సీఎం, నువ్వే హోం మంత్రి. ఒక దొంగలాగా చీకట్లో కూర్చొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయకు అని కేటీఆర్ హెచ్చరించారు.
శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందయ్యా..? నాకర్థం కాదు. ఎవడో దుబాయ్లో చనిపోతే దాన్ని నాకు అంటగట్టడం ఏంది నీ బొందా..? ఏమన్నా జ్ఞానం ఉందా నీకు అసలు..? రాష్ట్ర ముఖ్యమంత్రివా..? శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా..? దమ్ముంటే ఆధారం బయటపెట్టు.. ఏ టెస్టు చేస్తావో చేయ్. లేదంటే ఈ కిట్టి పార్టీ ఆంటీ లాగా వాళ్ల చెవి కొరికి, వీళ్ల చెవి కొరికి హెడ్ లైన్ మేనేజ్మెంట్ చేసి, మీడియానే మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు అని కేటీఆర్ సూచించారు.
నా మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే గతంలో నేను రేవంత్ రెడ్డి మీద కోర్టుకు పోయాను. కోర్టు ఏం చెప్పిందంటే చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడుతాం అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని పట్టుకుని రేవంత్ రెడ్డి స్టే అంటాడు. ఈ మూర్ఖుడికి ఇంజక్షన్ ఆర్డర్, స్టేకు తేడా తెలియదు. నువ్వు ముఖ్యమంత్రివి.. థర్డ్ రేట్ చిల్లరగాడిలా మాట్లాడకు అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు.