హైదరాబాద్ : ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుగనుంది. ఈ జాతర కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధాన జాతర ప్రారంభానికి ముందే గత కొన్ని రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకుని వెళ్తున్నారు. ఈ నెల 28 నుంచి నాలుగు రోజులపాటు ప్రధాన జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భక్తులందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ‘వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను కొలుస్తూ భక్తులు ప్రతీ రెండేళ్లకొకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకునే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతర’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే జాతర ఈ జాతర అని కొనియాడారు. సమ్మక్క సారలమ్మల పోరాట స్ఫూర్తికి, త్యాగనిరతికి ప్రతీక ఈ సమ్మక్క సారలమ్మ మహా జాతర అని తెలియజేశారు.
తెలంగాణతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే ‘తెలంగాణ కుంభమేళా’ మేడారం జాతర అని కేటీఆర్ అభివర్ణించారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.