హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏ రాకేశ్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పూర్తిస్థాయిలో గ్రాడ్యుయేట్ ఎన్నికపై దృష్టి సారించడం సాధ్యపడలేదు. లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ఉదయం తెలంగాణభవన్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి మూడు జిల్లాల నుంచి ముఖ్య నాయకులను ఆహ్వానించారు.
వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తదితర నేతలు పార్టీ ఎన్నికల ప్రచారణ ప్రణాళిక, వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానం ఏర్పడిన నాటి నుంచి నేటివరకు వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదల ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. గతంలో అధికారంలో లేని సమయంలోనూ ఇక్కడ గెలిచామని, పార్టీ అభ్యర్థి గెలవడానికీ, అధికారానికీ సంబంధంలేదని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పకడ్బంది వ్యూహంతో ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు, ఉద్యోగులకు చేసిన మోసాలు, టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్‌ను అమలుచేయకపోవడం, ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండటం, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతిపై మాట మార్చడం తదితర అంశాలను ప్రచార అస్ర్తాలుగా సంధించనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.