KTR | వందలాది మంది యువ ఇంజనీర్లకు సందేశమిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూడకుండా, వాటిని మీరే సృష్టించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. “మీరు సొంతంగా ఒక క్యూను సృష్టించగలిగినప్పుడు, ఇతరులు ఏర్పాటు చేసిన క్యూలో ఎందుకు నిలబడాలి?” అని ప్రశ్నించారు. “ఉద్యోగాలు వెతికేవారుగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారండి. మీరు పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత, మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు” అని ఆయన ఉద్భోదించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.
ఒకప్పుడు రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని చాలామంది సందేహించారని, కానీ, “ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత, అనేక రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. తెలంగాణ సాధించిన ప్రగతి విశ్వాసానికి పట్టుదలకు దర్శనీకత నిదర్శనం అన్నారు. కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా, దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నేటి యువతరం, Gen Z కు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.
ఆదాయం కంటే ప్రభావానికి (Impact), అధికారం కంటే ప్రామాణికతకు (Authenticity) ప్రాధాన్యత ఇవ్వాలని, వేగం, విస్తరణ (Speed and Scale) పట్ల ఆకలిని కలిగి ఉండాలని సూచించారు. మీరు ఇతరులు అనుకున్నదాని కంటే తెలివైనవారు, బాధ్యత కలిగినవారు. భారతదేశాన్ని ముందుకు నడిపించేది మీరే” అని విద్యార్థులకు తెలిపారు. మోటార్‌స్పోర్ట్స్ అయినా, పాలన అయినా, జీవితంలో అయినా విజయం కేవలం యాదృచ్ఛికంగా రాదని, “మనం మన అవకాశాలను రూపొందించుకోవాలి, ధైర్యంతో అమలు చేయాలి. అప్పుడే భవిష్యత్తు నిర్మితమవుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.