హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులపై లాఠీచార్జి చేస్తారా? ఇదేం దుర్మార్గం?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతుల పట్ల కూడా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అశోక్‌నగర్‌కు వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చిన రాహుల్‌గాంధీ ఇప్పుడు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. అరెస్టు చేసిన అభ్యర్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు.