KTR | కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రాం..రాం అవుతుందని ఎన్నిలకు ముందు కేసీఆర్ అన్నారని.. ప్రస్తుతం ఆయన చెప్పినట్లుగా అయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రైతుబంధు, రుణమాఫీ, బోనస్ విషయంలో కాంగ్రెస్ సర్కారుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ‘ఎటుపెట్టి వీళ్ల సిద్ధాంతం ఒకటే. ఎన్నికలకు ముందు అందరికీ అన్నీ.. ఎలక్షన్లు అయిపోయాయి కదా? కొందరికి కొన్ని. అట్ల కటింగ్‌లు పెట్టి ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఎజెండా తప్ప వీళ్లకు చిత్తశుద్ధి లేదు. ఆత్మహత్యల విషయంలో తప్పుడు మాటలు చెప్పారు. వానాకాలం రైతుబంధు ఎగొట్టారు. రూ.700కోట్లు బోనస్ ఇచ్చామంటున్నరు. ఆ బోనస్ బోగస్ అని చూపించాం ఈ రోజు. మేనిఫెస్టోలో పెట్టింది దొడ్డు వడ్లకు. సన్నాలకని సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు అని అడిగినం. అదేవిధంగా రైతుభరోసా అని పేరు మార్చారు తప్పా.. డబ్బులు పెరగలేదు. మార్పు మార్పు అంటే.. ప్రజలు కోరుకున్నది పేరు మార్పు కాదు గుణాత్మకమైన మార్పు. మాకు ఎక్కువ డబ్బులు రావాలి.. ఎక్కువ పెట్టుబడి సాయం కావాలని ఆలోచన చేశారు. అందుకే ప్రభుత్వాన్ని అడిగినం’ కేటీఆర్ తెలిపారు.
‘వానాకాలం ఎగొట్టారు.. మళ్లీ ఆ ప్రయత్నం చేయొద్దని చెప్పాం. పెంచిన రైతు భరోసా ఇవ్వాలని చెప్పాం. ప్రభుత్వానీ మేం నమ్మడం లేదు. వాళ్లు చెప్పే కాకి లెక్కలు నమ్మడం లేదు. రూ.22వేలకోట్ల దారి మళ్లినయ్.. దుర్వినియోగం జరిగిందని రేవంత్‌రెడ్డి చెబుతున్నడు. ఆయన మాటలు నేను కాదు.. ఎవరూ నమ్మడం లేదు. పచ్చి అబద్ధాలను ఆలంభనగా చేసుకొని బతికే వ్యక్తి. చేసిన అరకొర రుణమాఫీని.. డబ్బా కొట్టుకొని ఎవరూ చేయనిది చేసినా అని చెప్పుకున్నడు. ఆ నాడు రైతుబంధుకు రాంరాం అయితది.. నేను ముందే చెబుతున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే అని కేసీఆర్ చెప్పారో.. అది ఇవాళ వాస్తవం అయ్యింది. 12 నెలలు రైతుబంధు ఎండబెట్టి.. 12 రోజుల్లో ఇచ్చినమని చెప్పుకునే సిగ్గుమాలిన ప్రయత్నం చేస్తున్నరు. సన్నాలకు రూ.700కోట్ల బోనస్ ఇచ్చినమని చెప్పుకుంటున్నరు. రూ.7500కోట్ల రైతుబంధు ఎగొట్టినమని చెబుతలేరు. ఎగ్గొట్టింది కేవలం వానాకాలం మాత్రమే కాదు. రైతుభరోసా అని పేరు మార్చినవ్ కాబట్టి.. ఈ సంవత్సర కాలంలో 70లక్షల రైతుల కుటుంబాలకు నీ ప్రభుత్వం బాకీ ఉన్న మొత్తం రూ.26,775కోట్లు’ అని కేటీఆర్ తెలిపారు.
‘నువ్వే (రేవంత్‌రెడ్డి) చెప్పినవ్. కేసీఆర్ ఎకరానికి రూ.5వేలు ఇస్తుండు.. నేను రూ.7500 ఇస్తా అని చెప్పినవ్. కేసీఆర్ ముష్టి వేస్తున్నడు అని ఆనాడు ఎటకారపు మాటలు మాట్లాడినవ్. అందుకే ఇవాళ అడుగుతున్నం. నీ ప్రభుత్వం రైతులందరికీ కేవలం రైతుభరోసా విషయంలోనే రూ.26,775 కోట్లు బాకీ ఉన్నారు. ఇవాళ అరకొర రుణమాఫీ చేశారో.. అందులో రూ.20వేలకోట్లు రుణమాఫీ బాకీ ఉన్నది. ఇవాళ ఎంత అన్యాయం అంటే.. ఈ ప్రభుత్వం మాటలు మేం నమ్మమని ఊరికే అనడం లేదు. రూ.22వేల కోట్లు దారిమళ్లినయ్.. ఏదో తప్పు జరిగింది అనే వాతావరణం కల్పించి.. రేపు పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో వచ్చేటట్టు మీడియా మేనేజ్మెంట్.. హెడ్లైన్ మేనేజ్మెంట్ చేసి.. రైతుబంధు డబ్బులన్నీ ఖరాబ్ అవుతున్నయి కదా? ఇన్ని రోజులు కేసీఆర్ ఖరాబ్ చేసిండు కదా అనే ఓ అభిప్రాయం కలిగే విధంగా చేసి కటింగ్ పెట్టే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది’ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.
‘రాష్ట్రంలోని ఉద్యోగులు, రాష్ట్రంలో పాన్‌కార్డ్ హోల్డర్లకీ, పత్తి, కందిరైతులకు.. సోయా రైతులకు కూడా నా విజ్ఞప్తి ఇదే. ఈ ప్రభుత్వం ఇవాళ ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నది. రైతుబంధుకు రాం రాం చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మనం అందరం ఈ ప్రభుత్వంపై ఎక్కడిక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులను స్థానిక సంస్థల్లో నిలదీయండి. ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటున్నరు. అదే ఏ సంక్రాంతి చెప్పడం లేదు. 2024 సంక్రాంతా? 2025 సంక్రాంతా? రుణమాఫీ విషయంలోనూ ఇలాగే చెప్పారు. డిసెంబర్ 9న సంతకం అన్నరు.. మళ్లీ మరిచిపోయారు. డిసెంబర్ 9 రెండుసార్లు దాటిపోయినా రుణమాఫీ కాలేదు. అందుకే రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అన్నారు.