హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమి తర్వాత వచ్చే తాతాలిక విరామం పదునైన వ్యూహాలకు వేదికవుతుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజకీయ ప్రస్థానంలో 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ తన అంతరంగాన్ని ఆవిషరించారు. ‘వ్యక్తిగత దాడులు, కుటుంబంపై ట్రోలింగ్స్ ఎదురైనప్పుడు ఈ రాజకీయం నాకెందుకు?’ అని చాలాసార్లు ఏడ్చానని భావోద్వేగానికి లోనవుతూనే తెలంగాణను మళ్లీ పట్టాలెకించేందుకు తాము సిద్ధమయ్యామని ప్రకటించారు. 2028లో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ చీలిపోతుందనేది ప్రత్యర్థుల భ్రమ మాత్రమేనని, ఒక తుఫాన్ లాగా 100 శాతం తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాజకీయాల్లో పర్సనల్ లైఫ్‌ను, ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు, లేని లింకులు అంటగట్టి దుష్ప్రచారాలు చేసినప్పుడు చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తంచేశారు.
‘రాజకీయాల్లోకి రాకుండా ఉంటే బాగుండేది అని కొన్ని లక్షల సార్లు అనిపించింది. కానీ ఇప్పుడు ఓడిపోయి పారిపోయే మనిషిని కాదు నేను. మళ్లీ విజయం సాధించిన తర్వాతే అవసరమైతే రాజకీయాలు వదిలేస్తా తప్ప, నాయకుడిని కష్టాల్లో వదిలేసి వెళ్లను’ అని స్పష్టంచేశారు. కేసీఆర్ మౌనంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ ‘కేసీఆర్ ఈజ్ కేసీఆర్, హి ఈజ్ ఎ లివింగ్ లెజెండ్.. ఆయన ఒక బ్రాండ్.. చాలా సెక్యూర్ లీడర్..గోడ మీద వేలాడదీసే తుపాకీ, శతఘ్ని కూడా పేలే వరకు చాలా మౌనంగానే ఉంటయ్.. పేలితే విస్ఫోటమే! కేసీఆర్‌కు ఎప్పుడు గేర్ మార్చాలో బాగా తెలుసు’ అని వివరించారు. ‘ఇప్పుడున్న ముఖ్యమంత్రి పీఆర్ స్టంట్లు, మీడియా మేనేజ్మెంట్ డ్రామాలు కొన్ని రోజులే నడుస్తయ్’ అని స్పష్టంచేశారు.
ఉద్యమంలోకి వచ్చినప్పటి నుంచి మీ లైఫ్ ైస్టెల్ ఎలా మారింది?
20 ఏండ్ల కింద మా అమ్మ చెప్పింది. ‘అరేయ్.. నీకు సూట్ అవ్వదురా ఇదంతా’ అని! అప్పుడు నేను వినలేదు. ఇప్పుడైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది మా అమ్మ చెప్పిందే కరెక్టేమో? అని. చాలా సందర్భాల్లో ‘అసలు ఏం చేస్తున్నాం ఇకడ మనం? ఇదంతా ఏం నాన్సెన్స్?’ అని బాధ అనిపిస్తుంటది. కానీ, మనం చేసిన పని వల్ల కొంత మేలు జరిగినప్పుడు చాలా తృప్తిగా ఉంటది. రాజేంద్రనగర్ సభకు వెళ్తుంటే ట్రాఫిక్‌లో కార్ ఆగింది. ఒక అమ్మాయి (కల్పన) పరుగెత్తుకొని వచ్చి కార్ డోర్ కొట్టి, కండ్లలో నీళ్లతో ‘ఎప్పుడు వస్తారన్నా మళ్లీ మీరు? కేసీఆర్ ఎప్పుడు వస్తారు తిరిగి?’ అని అడిగింది. నందినగర్ రోడ్డు మీద లక్ష్మి అనే కూరగాయలు అమ్మే అమ్మాయి వచ్చి ‘మళ్లీ మీరే రావాలి’ అన్నది. మొన్న టీ-హబ్‌తో లాభం పొంది.. ఫోర్బ్స్- అండర్ 30లో నిలిచిన ఒక అబ్బాయి వాళ్ల నాన్నను తీసుకొచ్చాడు. వాళ్ల నాన్న ఒక సాధారణ వెల్డర్. కొడుకు ఏం సాధించాడో ఆ అమాయక తండ్రికి అర్థం కాలేదు కానీ.. ‘నా కొడుకు మీలాంటి వాళ్లతో కూర్చొని మాట్లాడుతున్నాడు అంటేనే సంతోషంగా ఉంది’ అన్నడు. ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడు ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ (పడ్డ కష్టానికి ప్రతిఫలం దకింది) అనిపిస్తుంది.
అమెరికా నుంచి వచ్చాక మిమ్మల్ని మీరు ఎలా నిరూపించుకున్నారు?
కేసీఆర్ తెలంగాణ సాధించిన దాని ముందు మిగతా ఏ అచీవ్మెంట్ అయినా దిగదుడుపే. నా కొడుకో లేక ఫ్యూచర్లో ఎవరైనా అడిగితే ‘తెలంగాణ సాధనలో నాది కూడా ఒక ఇసుక రేణువంత పాత్ర ఉన్నది అని చెప్పుకోవడానికి గర్వపడుతాను. కేసీఆర్ కొడుకుగా నేను పుట్టకపోయి ఉంటే.. ఇవ్వాళ నేను మీతో కూర్చొని మాట్లాడే అవకాశమే లేదు. 2014లో ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ నాకు మంత్రి పదవి ఆఫర్ చేస్తే.. నావల్ల ఇంత పెద్ద మనిషి బద్నాం అవుతరు.. కొడుకును క్యాబినెట్లో పెట్టుకున్నడు అంటరు.. వద్దు సార్ అన్నాను. అప్పుడు ఆయన అన్న మాట ఏందంటే.. ‘ఈరోజు కాదు ఇంకో 20 ఏండ్ల తర్వాత నీకు మంత్రి పదవి ఇచ్చినా కొడుకుకే ఇచ్చాడని అంటరు. నీకు సమర్థత, కేపబిలిటీ ఉంటే ప్రజల ముందు ప్రూవ్ చేసుకో. ప్రూవ్ సుకోకపోతే ప్రజలే పకన పెడుతరు. కాబట్టి నువ్వు నా కొడుకు అనడం ఒకటే క్వాలిఫికేషన్ కాకూడదు.. అట్లా అని నువ్వు నా కొడుకు కావడం నీ గ్రోత్‌కు అడ్డంకి కాకూడదు’ అన్నారు. ఆ లాజిక్ నచ్చి బాధ్యత తీసుకున్నా.. తు.చ తప్పకుండా పని చేసుకుంటూ పోయిన.
బలవంతంగా మిమ్మల్ని పాలిటిక్స్‌లోకి లాకొచ్చారా?
నేను కేసీఆర్‌కు తెలువకుండా రాజకీయాల్లోకి వచ్చిన. 2006 ఆగస్టులో కరీంనగర్‌కు కేసీఆర్ రాజీనామా చేస్తే.. ఆ రోజు నేను ఇండియాలో సౌత్ ఏషియా హెడ్‌గా ఉద్యోగం చేస్తు న్నా. మా బాస్‌ని టూ మంత్స్ లీవ్ అడిగితే కుదరదన్నాడు. ఆ రోజు కరీంనగర్లో గనుక కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమమే లేదు అనే పరిస్థితి. ఎంతో మంది పిల్లలు ఉద్యోగాల కు సెలవు పెట్టి వచ్చి పని చేస్తుంటే నేను ఇంట్లో ఉండటం సమంజసం అనిపించక సార్‌కు చెప్పకుండానే రిజైన్ చేసి వచ్చి పనిచేసిన. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సార్‌కు చెప్తే బాగా కోప్పడ్డారు. సో, నన్ను ఎవరూ బలవంత పెట్టలేదు.
మర్యాదపూర్వక రాజకీయం సాధ్యం కాదా?
2014 నుంచి 2018 వరకు జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము ఎప్పుడైనా అసెంబ్లీలో అలా మాట్లాడామా? చప్పట్లు ఎప్పుడైనా రెండు చేతులతోనే మోగుతయ్. కేసీఆర్ సభలో ఎప్పుడూ పెద్దలు జానారెడ్డిగారు అనకుండా మాట్లాడలేదు. వాళ్లిద్దరూ మాట్లాడుతుంటే సభ ఎంతో గౌరవంగా ఉండేది. ఇవ్వాళ ‘మా వెనుకాల పైల్వాన్లు ఉన్నరు‘ అంటూ ముఖ్యమంత్రి నోటెమ్మట ఎంత చండాలమైన, గలీజ్ భాష వస్తున్నదో చూస్తున్నం. సభా విలువలు రెండు వైపులా ఉండాలి. ఆయన కేసీఆర్‌ను తిట్టడం మానేస్తే నేనూ తిట్టను. ఆయన చైర్‌కు గౌరవం ఇస్తా..
పార్టీ ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన సందర్భాలున్నాయా?
అందరం మనుషులమే. పొరపాట్లు జరిగినయ్. ఉదాహరణకు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. తక్షణమే ఆ బోర్డును ఎత్తి అవతల పడేస్తే పిల్లల్లో ఆగ్రహం తగ్గేది. తప్పు మాది కాకపోయినా ఆ బోర్డు దరిద్రం మాకు చుట్టుకున్నది. రెండో తప్పు మేము చేసిన పనిని సరిగ్గా చెప్పుకోలేదు. 12 ఏండ్లలో నిరుద్యోగులకు లక్ష 60 వేల ఉద్యోగాలు ఇచ్చి కూడా ప్రచారం చేసుకోలేకపోయినం. తెలంగాణ రాకముందు ఐదు మెడికల్ కాలేజీలే ఉండేవి. మేము ఒకటే రోజు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించినం. కానీ దానికి అడ్వర్టయిజ్మెంట్ కూడా ఇవ్వలే. పదేండ్లు ప్రభుత్వ నిర్వహణలోనే ఉండి వరింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని, కార్యకర్తలను విస్మరించిన. అది నా తప్పే. కార్యకర్తలు నిర్లిప్తంగా అయిపోయి నష్టం జరిగింది.
ఆస్ కేటీఆర్ సెగ్మెంట్‌ని ఈ మధ్య ఎందుకు నిర్వహించట్లేదు?
హానెస్ట్‌గా చెప్పాలంటే అస్సలు టైం దొరుకట్లేదు. నన్ను ఇంట్లో కూడా తిడుతున్నారు. ‘గవర్నమెంట్లో బిజీ అన్నావ్.. ప్రతిపక్షంలో బిజీ అంటున్నవ్.. ఎప్పుడు ఫ్రీ అవుతావ్’ అని. ఇక మేనేజ్ చేయడం అంటే.. నేను మేనేజ్ చేయట్లేదు. ప్రొఫెషన్లో సక్సెస్ కావాలి అనుకుంటే పర్సనల్ సాక్రిఫైసెస్ తప్పవు. వర్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇట్స్ ఎ మిత్ (భ్రమ). శైలిమ దగ్గర నుంచి, పిల్లల నుంచి వచ్చే పెద్ద కంప్లైంట్ టైమే. నా కూతురి సూల్ లాస్ట్ పేరెంట్ మీటింగ్ పోదాం అంటే నా కూతురు ‘వద్దొద్దు నేనే పోతా’ అన్నది. సో చాలా వరకు మిస్ అయ్యాను. నా మట్టుకు నేను చాలా కూల్, లీనియంట్ ఫాదర్ అనుకుంటా.
పాలిటిక్స్‌లోకి రాకుంటే ఎకడుండేవాళ్లు?
అమెరికాలోనే జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ, నాకు అమెరికా ఎన్నడూ ఇష్టం లేదు. ఐ నెవర్ ఫెల్ట్ ఎట్ హోమ్. హైదరాబాద్ వదిలి ఢిల్లీలో నాలుగు రోజులు ఉంటేనే ఇది మన ఊరు కాదు అనిపిస్తుండె.
సూల్లో మీకు బాగా టఫ్ అనిపించిన సబ్జెక్ట్ ఏది?
మ్యాథమెటిక్స్ అంటే నాకు పిచ్చి కోపం. ఐ స్టిల్ హేట్. మా అమ్మేమో డాక్టర్ కావాలన్నది (సీటు కూడా వచ్చింది). నాన్ననేమో యూపీఎస్సీ రాసి సివిల్ సర్వెంట్కా అన్నరు. నేను ఇద్దరిదీ చేయలేదు. ఇద్దరినీ నిరాశపరిచి అమెరికా వెళ్లిన.
మీ లైఫ్‌లో ఒక హ్యాపియెస్ట్ మూమెంట్?
ఒకటి కేసీఆర్ దీక్ష ఫలించి ప్రకటన వచ్చిన 2009 డిసెంబర్ 9, రెండోది రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు. అవి రెండే మేజర్ మూమెంట్స్.
ఓ ఫంక్షన్లో మహేశ్‌బాబుతో మాట్లాడుతూ ‘నేను నీకంటే చిన్నవాడిని’ అన్నారు?
ఆయన నన్ను సార్ సార్ అంటుంటే.. బాస్ నువ్వు 75లో పుట్టావు.. నేను 76.. కాబట్టి వయసులో నీకంటే చిన్నోడిని అన్నాను.
కేసీఆర్ అంటే మీకు భయమా?
భయం, గౌరవం, భక్తి మూడూ ఉన్నయ్. ఐ వర్షిప్ హిమ్. ఇప్పటికీ ఆయన ముందు గట్టిగా మాట్లాడలేను. ఆయన ఏ మూడ్‌లో ఉన్నారో మా అమ్మను కనుకొని మరీ వెళ్తా. ఇంట్లో పర్సనల్ విషయం అడిగితే కొడుకులా చెప్తా.. పార్టీ విషయం అడిగితే లీడర్‌గా చెప్తా.
మీ బకెట్ లిస్ట్‌లో ఉన్న తీరని కోరికలేంటి?
ఈ సంవత్సరం ఫిఫ్టీ ఇయర్స్‌కి వస్తున్నాను. 50 పనులు చేయాలని ఫోన్లో రాసుకున్నా. ఒకటీ చేయలే. ఈజిప్ట్ పిరమిడ్స్ చూడాలని ఉన్నది. మొరాకో పోవాలని ఉన్నది. సై డైవింగ్ చేయాలనుకున్న. బంగీ జంపింగ్ మాత్రం చేయను. ఆ తాడు తెగితే కష్టం. మరి ఆ జగనన్న (వైఎస్ జగన్) అది ఎలా చేసిండో అడగాలి. ఈసారి కలిసినప్పుడు అడుగుతా..
జెన్-జీ విధ్వంసక మెంటాలిటీతో ఉన్నారా?
మనవాళ్లు నిజంగానే డిస్ట్రక్టివ్ అయితే.. 100 రోజుల్లో అన్నీ చేస్తామని హామీలిచ్చి 900 రోజులైనా చేయకపోయినా ఊరుకుంటున్నారు. రైతు బంధు మూడుసార్లు ఎగ్గొట్టినా, పెన్షన్లు ఇవ్వకపోయినా, రెండున్నరేండ్లలో కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోయినా పిల్లలు ఊరుకుంటున్నారు. నిజంగానే డిస్ట్రక్టివ్ అయితే ఇవ్వాళ ఒక కాంగ్రెస్ మంత్రి, ముఖ్యమంత్రి తిరిగే పరిస్థితి ఉంటుందా? మనవాళ్లు చాలా మంచి వాళ్లు, వెరీ లీనియంట్.
కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు చూశాం. కేటీఆర్ ఎప్పుడైనా ఏడ్చారా?
పర్సనల్ లైఫ్‌లో ఫ్యామిలీని అటాక్ చేసినప్పుడు.. పిల్లలను బాడీ షేమింగ్ చేసినప్పుడు చాలా సార్లు బాధపడ్డాను. ఒకసారి నా కొడుకు అడిగాడు నన్ను.. ‘మీ మీద వచ్చే ఈ రూమర్స్ అన్నీ అబద్ధం అయినప్పుడు మీరు ఎందుకు వాటిని ఖండించరు నాన్నా’ అని. ‘అవతలి వాడు వెయ్యి గొంతులతో దాడి చేస్తుంటే ఎందుకు మాట్లాడవ్?’ అని అడిగాడు. ఆ నిమిషంలో చాలా బాధేసింది.
నెక్ట్స్ తెలంగాణలో మేమేనని బీజేపీ, కాంగ్రెస్ అంటున్నయ్?
మా తలరాత రాసేది అల్టిమేట్‌గా తెలంగాణ ప్రజలే. కేసీఆర్ పరిపాలన చూశారు. మోదీ పాలన చూశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలన చూస్తున్నారు. మీకేది కావాలో మీరే నిర్ణయించుకోండి.
కేటీఆర్ ఈ మధ్య కొంచెం అగ్రెసివ్‌గా కనిపిస్తున్నారు?
అవతలి వారికి అర్థమయ్యే భాషలోనే చెప్పాల్సి వస్తది. ‘ఎంతపెద్ద ఉస్తాదైనా మూడు నెలల్లోనే పిల్లలు పుట్టించగలరా‘ అని ముఖ్యమంత్రి అంటే.. నేను ఏం చెప్పాలె ఆయనకు? ‘రైతుబంధు ఆపడానికి నేనేమన్నా హౌలాగాన్నా, దివానా గాన్నా‘ అని కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయనే మాట్లాడారు. మరిప్పుడు నేను ఏమనాలె?. నా తండ్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు కూడా నాకు ఉక్రోషం రాకపోతే నేను ఆయన కొడుకునే కాదు! రేవంత్‌రెడ్డి మా నాన్న చావును కోరుకున్నప్పుడు గట్టిగా మాట్లాడిన. కోటి సార్లు మాట్లాడుతా. బురదలో దిగిన తర్వాత.. అవతలి వాడు పెయ్యంతా బురద పూసుకొని వస్తాడు. నేను మాత్రం చాలా నీట్‌గా నా వైట్షర్ట్కు బురద అంటకూడదు అంటే ఎట్లా కుదురుతది?
సీఆర్ ఉద్యమ లీడర్ ఒకలా, సీఎం అయ్యాక మరోలా మారారా?
విజయం సాధించినప్పుడేమో ఆయన చాణక్యుడు అంటారు. ఓడిపోతే వాళ్లే విమర్శ చేస్తారు. కేసీఆర్ ఈజ్ కేసీఆర్. హి ఈజ్ ఏ లివింగ్ లెజెండ్. ఆయన ఒక బ్రాండ్. కేసీఆర్ చాలా సెక్యూర్ లీడర్. ఒక రోజు పేపర్లో నా వార్త రాకపోతే నన్ను మర్చిపోతారేమో అనే అభద్రతలో కొంతమంది నాయకులు బతుకుతా ఉంటరు. కేసీఆర్ జగిత్యాలలో మీటింగ్ పెడితే పారాలాల్గా మీటింగ్ పెట్టి టీవీ చానల్ కవరేజ్ సగం వచ్చేటట్టు చూసుకొనే దౌర్భాగ్యులు ఉన్న దేశం ఇది. రెండున్నరేండ్లుగా ఆయన హార్డ్లీ ఓ త్రీ-ఫోర్ టైమ్స్ బయటికి వచ్చి మాట్లాడారు. గోడ మీద వేలాడే తుపాకీ కూడా పేలే వరకు మౌనంగానే ఉంటది. శతఘ్ని కూడా పేలే వరకు చాలా మౌనంగా ఉంటది. పేలితే ఒక విస్ఫోటం తప్పదు. మేము మాట్లాడే ప్రతి మాటా కేసీఆర్ మాటే కదా? ఎప్పుడు కారు గేర్ మార్చాలో కేసీఆర్‌కు తెలుసు.
రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా? అని అనిపించిన సందర్భం ఏంది?
చాలా సందర్భాల్లో అసలు ఎందుకొచ్చాము రాజకీయాల్లోకి అనిపించింది. ముఖ్యంగా మా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు. నేను నా జీవితంలో సిగరెట్టే తాగలేదు. అలాంటి నన్ను పట్టుకొని ఎవడెవడో అడ్డమైనోళ్లు ‘నువ్వు డ్రగ్స్ తీసుకుంటవట’ అంటరు. అసలు బుద్ధి, జ్ఞానం ఉన్నదా వీళ్లకు? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని చూసిండ్రు. చివరికి లేని లింకులు అంటగట్టి.. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని, హీరోయిన్లతో ఇష్టం ఉన్న సంబంధాలు అంటగట్టి దుష్ప్రచారాలు చేసిండ్రు. వాళ్ల కాపురాలు కూలడానికి కూడా నేనే కారణమని స్వయంగా మంత్రులే మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడిస్తుంటే..ఏందిది? ఎందుకొచ్చాం ఈ దరిద్రంలోకి అని బాధ అనిపించింది.
ప్రాంతీయ పార్టీల అవసరం వైపౌట్ అవుతున్నదా?
ప్రాంతీయ పార్టీల అవసరం ఏమున్నది అనే వాళ్లకు చెప్తున్నా.. ఇవ్వాళ తెలంగాణలో 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలున్నరు. ఈ రెండున్నరేండ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎన్నరన్నా ఒకరోజు మాట్లాడిండ్రా? సెమీ కండక్టర్ ఇండస్ట్రీల (కేన్స్, మైక్రోన్)ను మోదీ గుజరాత్ తీసుకెళ్లిపోతే ఏం చేశారు వీళ్లు? లక్నోకు మెట్రో ఇస్తరు, మనకు ఇవ్వరు, మరి మన ఎంపీలు ఏం చేస్తున్నారు? తేజస్వి సూర్య అనే ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చిండు. అకడ ఒక బీఆర్ఎస్ ఎంపీ ఉంటే అవసరమైతే గల్లా పట్టుకొని కొట్టేటోడు.. మా తెలంగాణను పాకిస్తాన్‌తో పోలుస్తావా? ఎవడ్రా? నువ్వు అని! తెలంగాణను ఇష్టం వచ్చినట్టు అవమానిస్తుంటే ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు? అందుకే బీఆర్ఎస్ ఉండాలి.
రాపిడ్ ఫైర్
కేసీఆర్ : లివింగ్ లెజెండ్
తెలంగాణ : మై స్టేట్, అవర్ స్టేట్
హరీశ్‌రావు : మై కజిన్, లీడర్
మోదీ : ప్రైమ్ మినిస్టర్
హెల్త్ సీక్రెట్ : యోగా చేయను.జిమ్ చేస్తాను.బర్న్ మోర్ దాన్ వాట్ యు కన్స్యూమ్.