హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో విదేశాల్లో కన్నుమూసిన మరో తెలంగాణ వ్యక్తి మృతదేహం స్వగ్రామానికి చేరింది. అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో కేటీఆర్ అండగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకర్గంలోని హేమ్లానాయక్ తండాకు చెందిన విస్లావత్ బాబ్య.. బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు వీరాభిమాని. ఆయన బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు.
తీవ్రమైన గుండెపోటు కారణంగా గత నెల 27న అకడే చనిపోయాడు. స్వగ్రామానికి రప్పించడంలో సౌదీలో ఉన్న కఠిన నిబంధనలతో ఆ కుటుంబానికి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వారు షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ద్వారా కేటీఆర్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన కేటీఆర్ అక్కడి భారత విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడి బాబ్య మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు చొరవ తీసుకున్నారు.
ప్రక్రియను పూర్తిచేసేందుకు అవసరమైన సమాచారాన్ని అక్కడి దౌత్యకార్యాలయానికి చేరవేశారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నా కూడా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. చివరికి కేటీఆర్ చొరవతో బాబ్య మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గురువారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చివరిచూపు నోచుకుంటామో లేదోనన్న ఆందోళనలో ఉన్న తమకు అండగా నిలిచిన కేటీఆర్, అంజయ్య యాదవ్‌కు బాబ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.