KTR | హైదరాబాద్ : పాతికేళ్ల వసంతాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీన్ని పురష్కరించుకొని ఆదివారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బీఆర్ఎస్ నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, రాగిడి లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాది మంది ముఖ్య కార్యకర్తలు తరలి రానున్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్లో జరిగే సభకు ఐదు వేలకు పైగా ముఖ్యకార్యర్తలు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్ చేప్పేందుకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని రాంనగర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై, తెలంగాణచౌక్, కమాన్మీదుగా సభాప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. స్వాగతం తర్వాత జరిగే సభలో.. కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.