KTR | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన.. అని అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ సోమవారం ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ‘కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు, కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు, కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు.
చివరికి.. నల్లగొండలోని నీటిట్యాంకులో పది రోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు, సాగర్ ఘటన మర్చిపోకముందే కాంగ్రెస్ సరారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సరారు ఇది. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది.
మిషన్ భగీరథ పథకంతో మేము దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం ఇది’ అని మండిపడ్డారు. ‘గుర్తుంచుకోండి.. జలమే జగతికి మూలం. ఈ సరారు తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ను తరిమికొట్టడం ఖాయం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.