మహబూబాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా అప్పుడే తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ మహబూబాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన వారికి, స్వల్ప తేడాతో ఓడిన వారికి, పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.
కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన గౌరవ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు. గెలిచిన వారికేగాక అధికార పార్టీ డబ్బును, ఆగడాలను ఎదిరించి తక్కువ ఓట్ల తేడాతో ఓడిన బీఆర్ఎస్ తరఫు సర్పంచ్ అభ్యర్థులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం అలుపెరగకుండా కృషిచేసిన కార్యకర్తలకు కూడా నా అభినందనలు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. అధికార పార్టీకి ఓటస్తే తమ ప్రాంతంలో అభివృద్ది జరుగుతుందని ఓటర్లు ఆలోచిస్తారు. కానీ ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ తరఫు అభ్యర్థులు కూడా విజయాలు సాధించారు’ అన్నారు.
‘సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని తిమ్మినిబమ్మిని చేసే ప్రయత్నం చేసింది. స్వల్ప తేడాతో బీఆర్ఎస్ గెలిచిన చోట్ల రీ కౌంటింగ్ పేరు చెప్పి ఫలితాలను తారుమారు చేసిండ్రు. కొన్ని ప్రాంతాల్లో ముందుగా బీఆర్ఎస్ గెలిచినట్లు చెప్పి.. తర్వాత కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే కాదు, దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటివి జరిగాయి. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ మంచి ఫలితాలు రాబట్టిందంటే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా అప్పుడే తిరుగుబాటు మొదలైంది’ అని కేటీఆర్ చెప్పారు.