నల్లగొండ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ‘420’ హామీలను అమలు చేయలేక, ప్రజలకు ముఖం చూపించలేక సహకార ఎన్నికల నిర్వహణ నుంచి తప్పించుకుంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాలో సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కారు నామినేటెడ్ పద్ధతిలో ‘సహకార’ పదవులు నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఓటేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయయని అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను కూడా ప్రభుత్వం భయంతోనే వాయిదా వేస్తోందని విమర్శించారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ.. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యంగా చేసుకున్నట్టు.. మన దృష్టి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపైనే ఉండాలని కేటీఆర్ సూచించారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడేది లేదని, నల్లగొండ, మహబూబ్నగర్ రైతాంగానికి న్యాయం జరిగే వరకు మన పోరాటం ఆగవద్దని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా మంత్రులకు సాగునీటిపై కనీస అవగాహన లేదని, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహారెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.