మహబూబాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టంగనే రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటంపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నువ్వు ఒక్క భాషల తిడితే.. నేను మూడు భాషలల్ల తిడుత అని హెచ్చరించారు. మహబూబాబాద్‌లో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి మాటలు సంస్కార హీనంగా ఉన్నాయన్నారు. తాను అంతకంటే ఎక్కువే మాట్లాడగలనని, కానీ సంస్కారం అడ్డొస్తున్నదని చెప్పారు.
‘ఇటీవల కేసీఆర్‌గారు కాలు బయటపెట్టంగనే కొన్ని కుక్కలు మొరుగుతున్నయ్. మీరు గూడా చూసిండ్రు. కేసీఆర్ ప్రెస్ మీట్ల కనబడంగనే కొంతమందికి అజీర్తి అయితున్నది. ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నరు. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని, రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడిని పట్టుకుని ఎట్లబడితె అట్ల అంటున్నరు. ఓసారి కాలు విరిగింది అని సంతోషపడ్డరు. ఓసారేమో ఆయన సచ్చిపోవాలె అని శాపనార్థాలు పెట్టిండ్రు. ఇది మంచి పద్ధతేనా..? మాకు రావా మాటలు..? మాకు రావా బూతులు..?’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘రేవంత్‌రెడ్డీ.. నీకు నేను ఒక్కటే చెబుతున్నా. నీకు ఒక్క భాష మాత్రమే వచ్చు. నాకు మూడు భాషలు వచ్చు. నువ్వు తిట్టాలనుకుంటే ఒక్కటే భాషల తిడుతవ్. నేను తలుచుకుంటే నిన్ను మూడు భాషలల్ల తిడుత ఏమనుకుంటున్నవో. హిందీల, ఇంగ్లిష్‌ల, తెలుగుల తిడుత. అవసరమైతే ఉర్దూల కూడా తిడుత. ఇక్కడున్న మా అక్కలను, అన్నలను అడిగి గోర్‌మాటి భాషల కూడా తిడుత. లంబాడ సోదరుల భాష నేర్చుకుని అండ్ల గూడా తిడుత. కానీ నువ్వు కూసున్న కుర్చీకి విలువ ఇచ్చి మాట్లాడుతలేను. ఎందుకంటే నన్ను మా అమ్మ, నాయిన సంస్కారంతోటి పెంచిండ్రు. నిన్ను ఎట్ల పెంచిండ్రో నాకు అర్థమైతలేదు’ అన్నారు.
‘నియ్యి ఏం మాటలు..? ఏం భాష..? నన్ను గుంటూరుల సదువుకున్నవ్ అంటవ్. అవును నేను ఇంటర్మీడియట్ అక్కడనే సదువుకున్న. నేను ఆంధ్రాల సదువుకునుడు తప్పా..? మరె నేను ఆంధ్రాల సదువుకునుడు తప్పయితే.. నువ్వు భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకున్నవ్. అది ఒప్పెట్ల అయితది..? నేను నీ అల్లుడి గురించి ఎన్నడన్న ఏమన్న అన్ననా..? మరి నువ్వెట్ల అంటున్నవ్..? మీ కుటుంబాన్ని మేమేం అంటలేం. ఎందుకంటే అది మా సంస్కారం’ అని కేటీఆర్ చెప్పారు.