హైదరాబాద్, మార్చి 4 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇకనైనా రాజ్యాంగంపై నీతులు చెప్పడం ఆపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవుపలికారు. ఒక గుర్తుపై పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరో పార్టీకి వెళ్లిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారని గుర్తుచేశారు. ‘మీ పార్టీకి నియమ నిబంధనలు, నిజాయితీ ఉంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజాభిప్రాయం కోరాలి. లేదంటే, పార్టీలు మారిన వారిని ఆటోమెటిక్‌గా అనర్హులుగా మార్చడానికి రాజ్యాంగంలో మార్పులు చేయాలనే మీ నీతి ప్రసంగాలు ఆపండి’ అని మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ చురకలంటించారు. ఇంటర్ విద్యార్థులకు శుభాకాంక్షలు బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యంగా ఉండి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే.. ఫలితాల రూపంలో బహుమతి దక్కుతుందని పేర్కొన్నారు.
ఇతరుల గురించి అసభ్యంగా మాట్లాడటం కాంగ్రెస్ నేతల నైజమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేతలు ఎందుకు బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రోహిత్ శర్మకు కాంగ్రెస్ ప్రతినిధి నుంచి ఫిట్నెస్ సలహాలు, విజయాల సూచనలు అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు క్రూరమైనవని అభివర్ణించారు. సినీ నటుడు, ఆయన కుటుంబంపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రి అవమానకర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు కోర్టుకు హాజరవుతున్నారని గుర్తుచేశారు. ఇదీ వారి రాజకీయ కుసంస్కార స్థాయి అని మండిపడ్డారు. ‘మీకు జరిగిన అవమానానికి తోటి భారతీయుడిగా క్షమాపణలు కోరుతున్నా. మీరు రాక్‌స్టార్.. ఓ వెర్రి రాజకీయ నేత అభిప్రాయం మీ ప్రతిష్ఠను మసకబార్చలేదు’ అని రోహిత్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.