KTR | సూర్యాపేట : ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయి అంటే కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మారిందని పేర్కొన్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయలు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే ఖాతాల్లో టింగు టింగు మనీ పడుతున్నాయి. కేసీఆర్ కాంగ్రెస్ సన్నాసులను నమ్మితే రైతుబంధుకి రామ్ రామ్ అయితదని ముందే చెప్పిండు. అదే ఇవాళ జరిగింది. నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేపించుకొని తిన్నాడు అని కేటీఆర్ విమర్శించారు.
అధికారం మాత్రమే పోయింది ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది. అట్లనే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏ ఒక్క కాంగ్రెస్ నేత సమాధానం చెప్పడం లేదు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి నీళ్ళు రాకపోతే మరిప్పుడు కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎందుకు రావడం లేదు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారు. కృష్ణానదిలో 36 శాతం నీళ్లను కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంది. కానీ ఈ కాంగ్రెస్ సన్నాసుల ప్రభుత్వం 24 శాతం నీళ్లను కూడా వాడుకోలేదు. నీళ్లు వాడుకునే తెలివి లేదు. నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు. చెరువులనునింపే తెలివి లేదు. భూగర్భ జలాలను పెంచే తెలివి లేదు అని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ వైఫల్యాలను బిజెపి ప్రశ్నించదు. బడే భాయ్ మోడీ చోటే బాయ్ రేవంత్ మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది. తెలంగాణకు గొంతుగా బిఆర్ఎస్ ఉండొద్దని కాంగ్రెస్ బీజేపీల ఉమ్మడి లక్ష్యం. కేసీఆర్ తెలంగాణ పక్షం కాంగ్రెస్ బిజెపి ఢిల్లీ పక్షం. రేవంత్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని వరంగల్ సభకు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలి రావాలి. కాంగ్రెస్, బిజెపి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27.. రొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.