హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టు వెనుక దాకున్న ముసుగు దొంగ ఎవరు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై శనివారం ఎక్స్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ.1.50 లక్షల కోట్లు లూటిఫికేషన్‌కు తెరతీసిన ఘనుడు ఎవరు? రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న ఆ దొంగ ఎవరు? రైతుబంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2,500 చొప్పున ఇస్తా అని తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు? అవ్వ, తాతలకు నెలకు రూ.4,000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? ఆడబిడ్డల పెండ్లిండ్లకు తులం బంగారం ఇస్తా అని మాటతప్పిన దగావీరుడు ఎవరు? అని సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు.
తెలంగాణ అస్తిత్వ సంబురమైన బతుకమ్మ పండుగపై సర్కారుకు ఎందుకింత నిర్లక్ష్యమని కేటీఆర్ ప్రశ్నించారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రాట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బతుకమ్మ గిట్టదు, పట్టదా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో అకా చెల్లెండ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పంచాయతీల్లో పైసల్లేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? మహిళలకు బతుకమ్మ చీరలను రద్దుచేశారని, కనీసం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పదల్చుకున్నదా? అని కేటీఆర్ మండిపడ్డారు.