KCR | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పిన్న రాష్ట్రంగా పిలుస్తున్న తెలంగాణ ఆర్థిక వృద్ధిలో రారాజుగా వెలుగొందుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో తొమ్మిదిన్నరేండ్ల పాలనలో పటిష్ట పునాదులపై పునర్నిర్మాణమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు దేశానికే తలమానికంగా నిలిచింది. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి సుసంపన్నమైన రాష్ట్రంగా కొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తాజా నివేదికలో వెల్లడించింది.
పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను దేశ లేదా రాష్ర్టాభివృద్ధికి కొలమానంగా తీసుకొంటారు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఈఏసీ-పీఎం తాజా నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే తెలంగాణ 94 శాతం ఎక్కువ తలసరిని నమోదు చేసింది. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉన్నాయి. ఇక, జీడీపీలో తెలంగాణ వాటా కూడా అంతకంతకూ పెరుగుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. 2010-11లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 3.8 శాతంగా ఉండగా.. 2023-24 నాటికి ఇది 4.9 శాతానికి ఎగబాకింది. 13 ఏండ్ల వ్యవధిలో ఈ స్థాయిలో పెరుగుదల నమోదు చేసిన అతికొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు నివేదిక వివరించింది. 2014-15లో అప్పటి ధరలను బట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5.05 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ. 14.64 లక్షల కోట్లకు చేరింది. పదేండ్ల వ్యవధిలో తెలంగాణ జీఎస్డీపీ రూ. 9.59 లక్షల కోట్ల మేర పెరిగింది.
1991 కంటే ముందు దేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాల వాటా పెద్దగా లేనప్పటికీ, అనంతర కాలంలో జీడీపీలో వీటి ప్రాతినిథ్యం అనూహ్యంగా పెరిగినట్టు ఈఏసీ-పీఎం నివేదిక వెల్లడించింది. 2023-24 నాటికి దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ర్టాలు దేశ జీడీపీలో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే, దక్షిణాది రాష్ర్టాల్లో ఉత్పాదకత, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నట్టు వివరించింది. ముఖ్యంగా 2000వ సంవత్సరం నుంచి దక్షిణాది రాష్ర్టాల్లో నమోదైన తలసరి ఆదాయం జాతీయ సగటుతో పోలిస్తే ఎంతో ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తేల్చిచెప్పింది. తెలంగాణ అభివృద్ధి చెందింది అనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం ఏం కావాలి? కేవలం తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో జాతీయ సగటు కంటే 94 శాతం అధిక తలసరి ఆదాయాన్ని తెలంగాణ నమోదు చేసింది. తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. అంకెలు ఎప్పుడూ అబద్దాలు చెప్పవు. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెరిపేయలేరు. జై తెలంగాణ.. -ఎక్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్