బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ఒక్కటీ లేదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మాడల్ మారెట్ల వంటి ప్రతిదానికీ ప్రభుత్వం నిధులు బంద్ చేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయినయ్.
-కేటీఆర్
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా రూపాయి కూడా ఇవ్వకుండా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అధికారం చేపట్టిన రెండేండ్లలో పట్టణాలకు నిధులివ్వని ఏకైక ప్రభుత్వం రేవంత్‌రెడ్డిదేనని విమర్శించారు. పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. హైదరాబాద్‌లో శనివారం ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ శ్రేణులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పురపోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని, పారిశుధ్యం మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ఒక్కపనీ చేయలే
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ఒక్కటీ లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మాడల్ మారెట్ల వంటి ప్రతి ఒక కార్యక్రమానికీ నిధులు బంద్ చేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఓవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నిలదీశారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇచ్చిన నిధులను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.

కలిసికట్టుగా కొట్లాడాలి
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా కొట్లాడి ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పట్టణాల్లో వార్డులవారీగా కూడా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పేరుకుపోయిన సమస్యలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, అంశాలను ప్రస్తావిస్తూ చేపట్టాల్సిన చర్యలు చెప్పారు. రెండు జిల్లాల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని, అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కూడా పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పురపోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ఆయా జిల్లాల నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు వివరించారు. ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఉన్నదని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ శ్రేణులు కలిసికట్టుగా కొట్లాడి మంచి మెజారిటీతో విజయం సాధించాలి. పట్టణాల్లో వార్డులవారీగా కూడా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పేరుకు పోయిన సమస్యలను ప్రజలకు వివరించాలి. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను తట్టుకొని మంచి ఫలితాలు సాధించినం. అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలి. -కేటీఆర్