రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మాని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలి. మేము సంయమనం కోల్పోతే మీరు మిగలరు. మా సహనాన్ని పరీక్షించవద్దు.
-కేటీఆర్
సూర్యాపేట, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/నూతనకల్: రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. కేసీఆర్ పదేండ్ల పాలనలో పచ్చగా ఉన్న రాష్ర్టాన్ని అరాచకాలతో కాంగ్రెస్ (Congress) రాజ్యమేలుతున్నది. తక్షణమే కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకోవాలి. పోలీసులు కూడా అరాచకాలను ప్రోత్సహించడం మానుకోవాలి. పరిస్థితి ఇలాగే కొనసాగి పరాకాష్టకు చేరితే ఆ పార్టీని పాతరేయడం బీఆర్ఎస్కు పెద్ద సవాల్ కాదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) హెచ్చరించారు. తిరుగుబాటు వద్దు.. తిరిగి మన రోజులే రాబోతున్నాయని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండలం లింగంపల్లిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తదితరులతో కలిసి పరామర్శించారు.
మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటు ందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం లింగంపల్లిలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. దాడులను తట్టుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50% స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు. సర్పంచ్, పంచాయతీ ఎన్నికలకే కాంగ్రె స్ ప్రభుత్వం ఇంతగా భయపడుతున్నదని ఎద్దేవా చేశారు. రెండేండ్లలో అద్బుతాలు చేశామని రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెప్తున్న మాటలు నిజమే అయితే, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని కానీ, వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు.
మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం
తాము అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యకుగురైన మల్లయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్య జరిగిన రోజు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నానని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చానని, దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. వాస్తవానికి హత్య జరిగిన రోజే తాను ఇక్కడకు రావాలనుకున్నానని, బీఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఉన్నదని, ఉద్రిక్తతలు పెరగే అవకాశం ఉంటుందని జగదీశ్‌రెడ్డి, కిశోర్ చెప్పడంతో ఆగిపోయానని కేటీఆర్ తెలిపారు. దీనినిబట్టి బీఆర్ఎస్ నాయకులు ఎంతటి శాంతికాముకులో అర్థంచేసుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, మొక్కవోని ధైర్యంతో పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50% సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్యయాదవ్, బూడిద భిక్షమయ్యగౌడ్, భూపాల్‌రెడ్డి, నాయకులు చింతల వెంకట్‌రెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగేందర్‌రావు, దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేము తిరగబడితే రాష్ట్రం ఆగమైతది
దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత బీఆర్ఎస్ బలం తెలుసని, ఒకవేళ తమ క్యాడర్ కూడా తిరగబడితే ఏమైతదో ఒక్కసారి ఆలోచన చేయాలని కేటీఆర్ హెచ్చరించారు. ‘పదేండ్లు మేము అధికారంలో ఉన్నాం. ఏనాడూ మీలాగా ఆలోచంచలేదు. మేము కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఎలా ఉండేద’ని కేటీఆర్ ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మాని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే తాము కూడా తిరగబడక తప్పదని, అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి హింసాత్మక సంస్కృతి గతంలోలేదని, ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పదేండ్ల ప్రభుత్వంలో తుంగతుర్తిలో శాంతి వెల్లివిరిసిందని, అందరి సంతోషం, పేదల కడుపు నింపడం కోసమే పనిచేశామని చెప్పారు. అన్నదాతలకు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేశామని, తుంగతుర్తికి కాళేశ్వరం నీళ్లు తెచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయనే విషయం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ వారు దారుణంగా హత్య చేయడాన్ని బట్టి తెలుస్తున్నదని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో సైతం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి అతని చేత మూత్రం తాగించి దాష్టీకానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చిట్యాల మండలంలో తమ అభ్యర్థి గెలవాల్సి ఉండగా ఓట్లు గల్లంతు చేశారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏరియాలో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు.
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మాని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలి. మేము సంయమనం కోల్పోతే మీరు మిగలరు. మా సహనాన్ని పరీక్షించవద్దు. తస్మాత్ జాగ్రత్త.. కాంగ్రెస్ గూండాల్లారా.. -కేటీఆర్
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే మేము కూడా తిరగబడక తప్పదు. అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుంది. తెలంగాణలో ఇలాంటి హింసాత్మక సంస్కృతి గతంలో లేదు. ఇది మంచి పద్దతి కాదు.
-కేటీఆర్