హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ, కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘తొలిగండం దాటితే 90 ఏండ్ల ఆయుష్షు’ అన్నచందంగా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు. అల్లుడి కంపెనీలు, అదానీ పరిశ్రమలు, అన్నదమ్ముల ఆస్తుల పెంపు, ఢిల్లీకి మూటల చేరవేత కోసం రేవంత్రెడ్డి ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. పేదల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిని, చేతులకు బేడీలు వేసుకుని, నెలల పాటు చెరసాలల పాలైనా భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్నం లో పేదల గూళ్లు, ఉపాధి కేంద్రాలు, పాలడబ్బాలు, చెప్పుల దుకాణాలు, పల్లెల్లో పేదల భూములు, గరీబోళ్ల ఇండ్లు, పంటపొలాలు, పచ్చని పైర్లలో రేవంత్రెడ్డి అధికారులు స్వైరవిహారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏడాదికాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నదని, కాంగ్రెస్పాలనతో రాష్ట్రంలో దినదినగండంలా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు.