హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాపాలనలో విద్యార్థులకు ఉప్పు, కారంపొడి, బియ్యమే పౌష్టికాహారంగా అందిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘ముఖ్యమంత్రి తినే ఒక ప్లేట్ భోజనం ఖర్చు రూ.32 వేలు మాత్రమే.. చదువుకునే పేద విద్యార్థులకు మాత్రం గొడ్డుకారం.. శభాష్ ఇందిరమ్మ రాజ్యం.. వారెవ్వా ప్రజాపాలన’ అంటూ బుధవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని కృష్ణవేణి హాస్టల్లో టిఫిన్‌కు కారంపొడి పెడుతున్న ఫొటోలను జతచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇదే తరహా ఘటన జరిగినప్పుడు స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఇప్పుడు స్పందించరా? అని ప్రశ్నించారు. యూపీలో జరిగితేనే జాతీయ సమస్యగా మారుతుందా? వేరే రాష్ట్రంలో జరిగితే కాదా? అని నిలదీశారు. తెలంగాణ కాబట్టి కారం తీవ్రత, సమస్య తీవ్రత తగ్గుతుందని మీరనుకుంటున్నారా?’ అంటూ ట్వీట్ చేశారు.