హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పాలనలో సర్కార్ ఆస్తుల హారతి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ట్వీట్ చేశారు. ఢిల్లీలోని హిమాచల్భవన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గ్యారెంటీలు ఇవ్వడం, అందినన్ని అప్పులు చేయడంతో ఆఖరికి ఆస్తులను జప్తు చేయించుకునే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్పు చెల్లించకపోతే ఢిల్లీలోని హిమాచల్భవన్ను జప్తు చేస్తామని హైకోర్టు తీర్పు చెప్పిందని వివరించారు.
మహాధర్నాకు అనుమతిచ్చే ధైర్యం లేదా?
మహబూబాబాద్ మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం లేదా చిట్టినాయుడు? అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ‘నిమిషానికి 40సార్లు కేసీఆర్ రావాలే అని తెగ ఒర్లుతున్నవు. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిల్చునే మాట దేవుడెరుగు.. కనీసం మహాబూబాబాద్ మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు’ అని ఎద్దేవా చేశారు.