KTR | నర్సంపేట : రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతుభరోసా, రుణమాఫీ లాంటి హామీలను తుంగలో తొక్కి.. తాజాగా బోనస్‌పై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
ఈ ప్రభుత్వం అలవిగానీ హామీలిచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు అమలు చేశానని చెబుతున్నాడు. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలేదు. ఫ్రీ బస్సులో ఆడోళ్లు కొట్టుకుంటున్నరు.. సీట్లు దొరకట్లేదని పురుషులు బాధపడుతున్నారు. ఫ్రీ బస్సు కూడా ఫెయిలైంది. ఇక క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. నిన్న చావు కబురు చల్లగా చెప్పిండు. సన్న వడ్లకే బోనస్ ఇస్తడంట. అప్పుడేమో అన్ని వడ్లు. ఇప్పుడేమో కొన్ని వడ్లు అంటున్నారు. ఇదే మాట ఎలక్షన్లు ముందు చెప్పి ఉండాలి కదా..? 95 శాతం దొడ్డు బియ్యం పండిస్తున్నారు. సన్న వడ్లు పండించే 5 శాతం మందికి కూడా బోనస్ తీసుకోరు. ఎందుకంటే సన్న వడ్లకు ప్రయివేటు మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 2,500 నుంచి రూ. 3 వేల వరకు ధర ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే బోనస్ వైపు ఎవరూ చూడరు. మోసం చేయడమే కాంగ్రెస్ పని అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ బాగుండే. ఇవాళ కరెంట్ కోతలు ఉన్నాయి. విత్తనాలు దొరకడం లేదు.. ఎరువులు లేవు. నాట్లు వేసేటప్పుడు పడాల్సిన రైతుబంధు ఓట్లు వేసేటప్పుడు పడుతున్నది. డిసెంబర్లో పడాల్సిన రైతు బంధు మేలో పడుతుంది.. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన మహా మార్పు అని కేటీఆర్ విమర్శించారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో ఐదు గంటల పాటు సాయంత్రం 4.30 నుంచి 9.30 దాకా కరెంట్ లేదు. ఐదు గంటలు కరెంట్ పోతే ఒక్క జనరేటర్ కూడా పని చేయలేదు. మరి నవజాత శిశువుల పరిస్థితి, ఐసీయూలో ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంటి..? ఇదేనా మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.