KTR | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మినిస్టర్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా లగచర్లలో పోలీసులు చేసిన దౌర్జన్యానికి బాధ్యత తీసుకొని.. సిగ్గు ఉంటే ముక్కు నేలకి రాసి రేవంత్ రెడ్డి రాజీనామా రాయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సంచలన విషయాలు బయటపెట్టారు. లగచర్ల రైతులను కొట్టి, శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు బృందం నిర్ధారించిన సంగతి తెలిసిందే.
ఇవాళ నందినగర్‌లో కేటీఆర్ నివాసంలో ఆయనను లగచర్ల బాధితులు కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లగచర్లలో ఎక్స్‌ట్రాలు చేసి ప్రజలను చిత్ర హింసలు పెట్టి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డ పోలీస్ అధికారులను డిస్మిస్ చేయాలని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అని తెలిపారు. భూసేకరణ కూడా చట్ట విరుద్ధంగా జరిగిందని ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. దొంగచాటుగా భూసేకరణ చేయడం ఆపకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
లగచర్ల రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టి, దారుణంగా కొట్టారని ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్‌లో చెప్పారు. సొంత నియోజకవర్గ రైతులను దారుణంగా కొట్టించిన రేవంత్ రెడ్డికి సిగ్గు, ఇజ్జత్ ఉంటే ఈపాటికి రాజీనామా చేయాలి. కానీ రేవంత్ రెడ్డికి ఇజ్జత్ లేదు. పోలీసులు తమపై లైంగిక దాడి చేశారని లగచర్ల మహిళలు ఎన్హెచ్ఆర్సీ బృందానికి తెలిపారు. రాత్రిపూట గ్రామంపై పోలీసులు దాడి చేసి మహిళల తొడలపై దారుణంగా కొట్టి, కొట్టినట్టు జడ్జి ముందు చెప్తే ఇంకా దారుణంగా కొడతామని బెదిరించారని గిరిజన మహిళలు ఎన్హెచ్ఆర్సీ వాళ్లకు చెప్పారని కేటీఆర్ తెలిపారు.