హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలనే విజన్ ఏమాత్రం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కలుషిత మూసీ కన్నా ఆయన ఉపయోగించే భాష నుంచే ఎకువ కంపు వస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని, ప్రతిపక్ష బీఆర్ఎస్పై, మూసీ పేరిట దోపిడీని వ్యతిరేకిస్తున్న ప్రజలపై రేవంత్‌రెడ్డి కడుపులో కొండంత విషం పెట్టుకున్నారని ఆరోపించారు. డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి.. ముందే లక్షన్నర కోట్లు వ్యయం అవుతుందని ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీపీఆర్‌కు ముందే బుల్డోజర్లతో పేదల ఇండ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ లూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీకి రేవంత్‌రెడ్డి స్కెచ్ వేశారని, బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
అవి కాళేశ్వరం నీళ్లు కాదా?
సమైక్యరాష్ట్రంలో మూసీని కలుషితం చేసిందే 60 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దశాబ్దాల పాటు నల్లగొండ ప్రజలను మూసీ మురికితో ఇబ్బందుల పాలుచేసిన పాపం కాంగ్రెస్, టీడీపీల ప్రభుత్వాలదేనని ధ్వజమెత్తారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి ముందుగా అవి కాళేశ్వరం నీళ్లా కాదా చెప్పి ముకు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
కమీషన్ల కోసం నాటకం
పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే అతి తకువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కానీ రేవంత్ కమీషన్ల కోసం కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. దాదాపు 16వేల కోట్లతో మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తే ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఆ అంచనాలను లక్షన్నర కోట్లకు పెంచి అతిపెద్ద కుంభకోణానికి తెరతీశారని విమర్శించారు. ఔటర్‌ను కనెక్ట్ చేసేలా ఎక్స్‌ప్రెస్ వే ప్రణాళిక కూడా గతంలోనే సిద్ధం చేశామని గుర్తుచేశారు. మురుగునీటి శుద్ధికి 36 ఎస్టీపీలను నిర్మించినట్టు తెలిపారు.