హైదరాబాద్ జూలై 4 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించడంలేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. హక్కుల కోసం చలో సెక్రటేరియట్‌కు బయల్దేరిన నిరుద్యోగులను ఎక్కడిక్కడ నిర్బంధించి భగ్నం చేయడం, రాహుల్‌గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు సచివాలయానికి వచ్చిన వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు. యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించి గద్దెనెక్కిన తర్వాత నట్టేట ముంచారని నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర పాలనలో పట్టుమని పదివేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి నియామక ప్రక్రియ పూర్తిచేస్తే, రేవంత్‌రెడ్డి పత్రాలిచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను అడుగడుగునా దగా చేసిన ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఏనాటికీ క్షమించబోరని హెచ్చరించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, కానీ మరోవైపు వాళ్లే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
కార్యాచరణ ప్రకటించి మెడలు వంచుతం
ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్‌లోని హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల ఉసురు తగులుతుందని కేటీఆర్ హెచ్చరించారు. చలో సెక్రటేరియట్ చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసి వారి గొంతులు నొక్కలేరని, వారందరిని భేషరతుగా విడుదల చేయాలని, ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కారు మెడలు వంచుతామని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.
చరిత్రలో కొమురయ్యది సుస్థిర స్థానం
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడుగా దొడ్డి కొమురయ్య తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానం దక్కించుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. శుక్రవారం కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వం సమున్నత గౌరవమిచ్చిందని గుర్తుచేశారు. ఆ మహనీయుడి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు మనమందరం కంకణబద్ధులవుదామని పిలుపునిచ్చారు.
ఓయూలో పోలీసులకేం పని?
‘కాంగ్రెస్ సంవిధాన్ సభ కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో పోలీసులకేం పని? ఉద్యోగాలివ్వాలని అడిగిన విద్యార్థులను ఈడ్చివేసే హక్కు వారికి ఎవరిచ్చారు? నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం నుంచి తొలగించారా?’ అని ఖర్గేను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్య హక్కులను కాంగ్రెస్ సర్కారు కాలరాస్తున్నదనడానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల మాట ఏమైంది? అని నిలదీశారు. ‘ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ గుండె చప్పుడనేది నిర్వివాదాంశం. అక్కడ విద్యార్థులు నిరసనలు తెలుపకపోతే తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు’ అని స్పష్టంచేశారు. ఇప్పుడు కూడా ఉద్యమాల పురిటిగడ్డపై నుంచి విద్యార్థులు తమకిచ్చిన కాంగ్రెస్ వాగ్దానాల గురించి అడిగితే భయమెందుకని కేటీఆర్ నిలదీశారు.
రాహుల్‌గాంధీని పిలిపించి అశోక్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో ఛాయ్‌పే చర్చ సందర్భంగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ జాడేమైంది? ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన మాటేమైంది? ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా రేవంత్‌రెడ్డీ?
– కేటీఆర్