కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ఒక సహాయ మంత్రి.. మరో నిస్సహాయ మంత్రి ఉన్నరు.. వారితో ఊదు కాలదు..పీరులేవదు. ప్రజాసమస్యలపై ప్రకటనలకే పరిమితమవుతూ తెల్లారి లేస్తే కేసీఆర్‌ను తిడుతూ రేవంత్‌కు వంతపాడుతున్నరు. ‘నిజంగా వారు పోరాటం చేయాలనుకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై చెయ్యాలె. లగచర్ల, హైడ్రా, హెచ్‌సీయూ అంశాలపై మీడియా ఎదుట ప్రభుత్వాన్ని ఎండగడుతున్నట్టు పోజులు కొట్టి చీకట్లో చేతులు కలిపారు.-కేటీఆర్
KTR | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తేతెలంగాణ) : ఓ వైపు ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల్లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెడతామని గప్పాలు కొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ ముసుగు లో రేవంత్ సర్కారు అవినీతి మురుగు పారిస్తున్నదని నిప్పులు చెరిగారు. మూసీ పునరుద్ధరణతో మురిసే రైతులెందరూ? సుందరీకరణతో వచ్చే ఉద్యోగాలెన్ని? అని అడిగితే సర్కారు సమాధానం చెప్పడంలేదని విరుచుకుపడ్డారు. ‘బీఆర్ఎస్ హయాంలో నే మూసీ పునర్నిర్మాణానికి అంకురార్పణ చేసినం. అనేక ఎస్టీపీలు నిర్మించినం. గోదావరి నీళ్లను గండిపేటకు మళ్లించి అక్కడి నుంచి మూసీకి తరలిస్తే సరిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ. 1.50 లక్షల కోట్లను మూసీలో పోసి ప్రజలను మోసం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడు తూ నిలువనీడను కోల్పోయిన మూసీ బాధితులు ఆక్రోశంతో బూతులు తిడుతుంటే సర్కారు అక్రమ కేసులతో బెదిరిస్తున్నదని ఆరోపించారు. హెచ్‌సీ యూ విద్యార్థులు వీరోచిత పోరాటంతో రేవంత్ కబ్జా పర్వానికి చెక్‌పెట్టారని అభినందించారు. విద్యార్థి ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతిచ్చింది, న్యాయపరంగా సహాయం చేసింది.. అంతేగానీ వారిని ఎక్కడా రెచ్చగొట్టలేదని స్పష్టంచేశారు.
రేవంత్ కాబట్టే దులుపుకొని పోతున్నడు
‘అమ్మతోడు చెప్తున్న ఇయ్యాల జనం తిట్టే తిట్లకు రేవంత్ గాబట్టి దులుపుకొని పోతున్నడు.. ఎందుకంటే ఆయన మూడు అరాచకాలు సృష్టించిండు. మొన్న హైడ్రా, నిన్న మూసీ, ఇయ్యాల హెచ్‌సీయూ.. అక్కడ జింకలు లేవు గుంట నక్కలున్నయ ని బుకాయిస్తున్నడు. మరి అక్కడ నాలుగు జింకలు సచ్చిపోయినయ్..రేవంత్ ఏమంటడు? ఒక్క జింక ను చంపితేనే సల్మాన్‌ఖాన్‌ను జైల్లో పెట్టిన్రు. నాలుగు జింకల మరణానికి బాధ్యుడైన సీఎంను ఏం జెయ్యా లె? రేవంత్లాంటోళ్లు జేయబట్టి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్ముతలేరు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోరని తిడుతున్నరు’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
కేంద్రంలో సహాయ.. నిస్సహాయ మంత్రులు
రాష్ట్రం నుంచి కేంద్రంలో ఒక సహాయ మంత్రి.. మరో నిస్సహాయ మంత్రి ఉన్నారని, వారితో ఊదు కాలదు.. పీరులేవదు అని కేటీఆర్ దెప్పిపొడిచారు. వీరు తెల్లారితే కేసీఆర్‌ను తిడుతూ సీఎం రేవంత్‌కు వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది చొప్పున ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపిస్తే నయాపైసా తేలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ నేతలు గల్లీలో కొట్లాడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరిగి 200 రోజులు దాటినా ఇంతవరకు ఏం దొరికిందో చెప్పడం లేదు..కేసు పెట్టడం లేదు. అంటే రెండు పార్టీలు దొందూదొందేననే విషయం ప్రజలకు అర్థమైంది’ అని నిప్పులు చెరిగారు.
బలమైన బంధంతోనే రేవంత్ మౌనం..
‘నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీట్ దాఖలైతే దేశంలోని కాంగ్రెస్ నేతలంతా ధర్నాలకు దిగుతూ బీజేపీని ఎండగడుతున్నరు. రాష్ట్రంలో కూడా పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క మాటా మాట్లాడలేదు. వాళ్ల అగ్రనేతల మీద కేసులు పెట్టినా చడీ చప్పుడు లేదు. మోదీ, రేవంత్ దృఢమైన బంధమే ఇందుకు కారణం. ఆయనను ఈయన కాపడుతరు..ఈయనను ఆయన కాపాడుతరు’ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఒక్కటి కాకుంటే విచారణకు వెనుకడుగెందుకు?
‘ప్రధానమంత్రికి ఏడాదికోసారి తెలంగాణ యాదికొస్తది. నిరుడు ఏప్రిల్ 15న రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ ఆరోపించారు. దానిపై ఎలాంటి కేసు లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ ఏమైందని ఆరా తీసింది లేదు. విచారణ లేదు. మళ్లీ ఏడాది తర్వాత మొన్న రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లోకి బుల్డోజర్లు పంపుతూ అరాచకం సృష్టిస్తున్నదని చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ కూడా భూముల అమ్మకం పేరిట ఆర్థిక అక్రమాలు జరిగాయని తేల్చింది. కానీ ఏడాదికోసారి ఆరోపణలు చేస్తున్న మోదీ ఎందుకు పట్టించుకోవడంలేదు? పూర్వపు అనుబంధంతోనే రేవంత్ సర్కారును కాపాడుతున్నరా? లేదంటే ఇందులో మర్మమేంది? మోదీ రేవంత్ ఒక్కటికాకుంటే వెంటనే సీబీఐనో, సీవీసీనో పంపించి విచారణకు ఆదేశించాలె’ అని కేటీఆర్ సూటిగా నిలదీశారు. నిజంగా కాంగ్రెస్ అక్రమ వ్యవహారాలను అడ్డుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
భుజాలు తడుముకున్న చందంగా..
‘సెంట్రల్ యూనివర్సిటీ భూ దందా వెనుక ఓ ఎంపీ ఉన్నడని నేను ఆరోపించిన. పేరు మాత్రం చెప్పలే. ఇగ ఒకలెనుక ఒకరు ఉరికివస్తున్నరు. గుమ్మడి కాయ దొంగెవరంటే భుజాలు తడుముకుంటున్నరు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో తెలంగాణకు ఒరిగిందేమీలేదు. 16 నెలల్లో ఒక్క సమస్యపై పోరాడలేదు. లగచర్ల లంబాడా రైతులను జైల్లో పెడితే అడిగిందీ లేదు. వాళ్లకు తెలిసిందొక్కటే.. ప్రజలకు మతపిచ్చి లేపుడు! కానీ ప్రజలు రిస్క్ తీసుకోరు. ముమ్మాటికీ ప్రజల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్నే గెలిపిస్తరు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైడ్రా పేరిట రేవంత్ సర్కారు హైదరాబాద్‌లో అరాచక పర్వానికి తెరలేపింది. కోర్టు సెలవులు చూసుకొని పెద్దోళ్లు, రేవంత్ సోదరుడిని వదలి పేదోళ్ల ఇండ్లను కూల్చింది. న్యాయస్థానం మొట్టికాయలేసినా పట్టించుకోకుండా గరిబోళ్ల పొట్టగొట్టింది. హైడ్రా దెబ్బ.. సర్కారు చేతగానితనంతో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. కాంగ్రెస్ 16 నెలల పాలన అన్ని రంగాలను దెబ్బతీసింది.
-కేటీఆర్