KTR | మంచిర్యాల, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామని పెట్టిన నిబంధనను ఎత్తేసి ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పత్తి సాగైతే.. కనీసం ఏ ఒక్క జిల్లాలోనూ లక్ష క్వింటాళ్ల పత్తిని కూడా ప్రభుత్వాలు కొనలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ఎలాగైతే 13 క్వింటాళ్ల దాకా కొన్నారో.. ఇప్పుడూ అలానే కొనాలని డిమాండ్ చేశారు. అలా కొనేదాకా కొట్లాడే బాధ్యత తమది అని స్పష్టంచేశారు.
పత్తికి 8 నుంచి 12 శాతం తేమ నిబంధనను ఎత్తేసి 20 నుంచి 22 శాతం తేమ ఉన్నా మద్దతు ధరతో కొనాలని, రంగు మారిన సోయా పంటను ఎలాంటి షరతుల్లేకుండా కొనుగోలు చేయాలని, అనావృష్టి, అతివృష్టితో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, రైతులను ఇబ్బంది పెడుతున్న కపాస్ కిసాన్ యాప్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. రైతులెవరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. పత్తి, సోయా పంటల కొనుగోళ్ల విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. ఆదిలాబాద్, భైంసా మార్కెట్ యార్డుల్లో రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుకున్నారు. పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీసీఐ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడారు.
22 శాతం తేమ ఉన్నా కొనాలె
‘ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నేలలు. నీళ్లు ఎక్కువ గుంజుతయి. దానికి తోడు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతయి. చలి ఎక్కువ ఉంటే తేమ శాతం ఎక్కువ ఉండదా? ఆమాత్రం కామన్సెన్స్ లేదా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు, ఇదే సీసీఐతో 22 శాతం తేమ ఉన్నా కొనిపించినం. నడిపేటోడికి తెలివి ఉంటే.. నడిపేటోనికి రైతు మీద ప్రేమ ఉంటే. నడిపేటోడు రైతు బిడ్డయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతది’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఇప్పుడు తేమ శాతం ఎక్కువ ఉన్నదంటూ కోత పెట్టి రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. ‘రైతులు సచ్చిపోతున్నా.. రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. రుయ్యడిలో పత్తిరైతు కుమ్మరి ప్రేమేందర్ ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకున్నోడు లేడు.. అడిగినోడు లేడు’ అని ధ్వజమెత్తారు.

ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఐదు లక్షల క్వింటాళ్ల పత్తి కొని ఉండాల్సిందని, ఇప్పటి వరకు కనీసం లక్ష క్వింటాళ్లు కూడా కొనలేదని, ఇందుకు కారణం పనికి మాలిన యాప్‌ను తేవడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పత్తికి రూ.8 వేల మద్దతు ధర ఇచ్చామని, ఇవాళ రూ.8100 ఇవ్వాల్సి ఉన్నా కొనుగోళ్లు చేయకుండా కొర్రీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులు దళాకారులకు రూ.5900 నుంచి ఎక్కువలో ఎక్కువ రూ.6200 చొప్పున అమ్ముతూ తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ‘ఇప్పుడు వస్తుంటే ఓ యువ రైతు కలిసి.. అన్నా మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది.. సోయాబీన్ పండించినం. మా అమ్మ 60 ఏండ్ల పెద్దమనిషి. ఆమె ఇక్కడికి వచ్చి అమ్మాల్నంటే మోకాళ్ల నొప్పులున్నయ్.
ఆమె ఇక్కడికి వచ్చి ఫింగర్ ప్రింట్ వేయాలనడం ఎక్కడి కత? నేను ఆమె కొడుకొనే కదా? నేను ఏమన్న లంగనా? దొంగనా? స్మగ్లర్‌నా? నేను ఆ పైసలు పట్టుకొని ఎక్కడికి పోతా? మేం ఏమన్న కోట్ల రూపాయలు సంపాదించుకుంటమా? మా అమ్మ పండించింది నేను మార్కెట్లో అమ్ముకుందామంటే వీళ్లకు ఏం నొచ్చింది? అని అడిగిండు. నిజమే కదా? ఆయన పంట ఆయన అమ్ముకుంటా అంటే వీళ్లకు ఏం నొప్పి?’ అని నిలదీశారు. ‘ఇప్పుడు మేం వస్తున్నామని ఫింగర్ ప్రింట్ తీసేయడం సంతోషం.. సోయా సైతం ఏడు క్వింటాళ్లు కొనేది పది క్వింటాళ్లు చేశారంట.. అది కూడా సంతోషం.. మేము వస్తామంటేనే కదలిక వచ్చింది. నిన్న మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నాక క్యాబినెట్ మీటింగ్ పెట్టిండ్రు. పత్తి రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే నిన్నటి క్యాబినెట్లోనే రైతు సమస్యలు పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాల్సింది. అట్లా చేయకుండా యాక్టింగ్ చేసిండ్రు’ అంటూ మండిపడ్డారు.

బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు ఏం చేస్తున్నరు?
‘ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్, బేల వంటి జాగల్లో ఎకరాకు 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల దాకా పత్తి పండుతుందని ఇప్పుడే ఓ రైతు చెప్పిండు. ఎకరాకు ఏడు క్వింటాళ్లే కొంటే అలాంటి రైతులు మిగతా పంట ఎక్కడ అమ్ముకోవాలో ప్రభుత్వాలే చెప్పాలె’ అని కేటీఆర్ నిలదీశారు. ‘నేను ఇక్కడికి వస్తుంటే జోగు రామన్న మా ఆదిలాబాద్‌లో రైతుల పరిస్థితి కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్టు తయారైందని చెప్తూ బాధపడ్డరు. కేసీఆర్ ప్రభుత్వం పోయినంక కరెంట్ సక్కగ వస్తలేదు.. రుణమాఫీ సక్కగ కాలేదు.. పోనీ యూరియా అన్న సక్కగ ఇస్తరా అంటే అదీ ఇస్తలేరు.. ఇన్ని కష్టాలు పడి చివరికి పండించిన పంటను అమ్ముకుందామంటే కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతుకు ఇట్లా అయిపోయింది అని బాధపడ్డరు’ అని వాపోయారు. ‘జోగు రామన్నకు ఉన్న తపన ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలకు ఉన్నదా? రైతులు అరిగోస పడుతుంటే వాల్లు ఏం చేస్తున్నట్టు?’ అని నిలదీశారు. ‘సీసీఐ కేంద్ర సంస్థ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు ఇక్కడి రైతులకు ఎందుకు న్యాయం చేస్తలేరో ఆలోచించుకోవాలె’ అని హితవుపలికారు. ‘ఎన్నికలప్పుడు సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ని తెరిపిస్తామన్నరు. అదీ తెరిపియ్యలేదు. పోనీ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచైనా ఏమన్నా చేస్తరా అంటే కనీసం పత్తి కొనుగోళ్లు కూడా సక్రమంగా జరిపిస్తలేరు’ అని ఎద్దేవాచేశారు.

అఖిలపక్షంతో వస్తం.. దమ్ముంటే మోదీని కలిపిస్తరా?
రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు రైతుల మీద ప్రేమ ఉంటే.. ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ పోయి మోదీతో కొట్లాడాలె. మా రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతన్నవ్ అని అడగాలె.. అవసరమైతే వేరే దేశాలకు మన పత్తిని పంపాలె గాని.. ఎందుకు ఇట్లా చేస్తున్నవని నిలదీయాలె’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘అఖిలపక్షంతో కలిసి కేంద్రం వద్దకు వెళ్లడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి దమ్ముంటే మమ్ములను ప్రధాని మోదీ వద్దకు తీసుకపోవాలె’ అని సవాల్ చేశారు.
భోరజ్ ధర్నాకు మద్దతు
ఈ నెల 21న పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ సమీపంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ, బీఎస్పీ, రైతు స్వరాజ్య వేదిక, రైతు సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. దానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరం వస్తామని, రైతులు సైతం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. ‘ఎన్నికల ముందు సోయాకు, పత్తికి, వడ్లకు బోనస్ ఇస్తానని రేవంత్‌రెడ్డి చెప్పిండు. మరిప్పుడు వస్తున్నదా బోనస్? రుణమాఫీ కాదు.. రైతు బంధు రాదు.. కరెంట్ కూడా ఉండదు.. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు దిక్కులేడు’ అని మండిపడ్డారు. పత్తి కొనేటోళ్లు లేక ఇంట్లో నిల్వచేసుకుంటే పత్తితో పాటు ఇండ్లు కాలిపోయి నష్టపోయిన రైతులు దీపక్, కుమ్మరి సురేశ్‌లకు పార్టీ తరఫున కొంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రేపో, ఎల్లుండో జోగు రామన్న, అనిల్ జాదవ్ చేతుల మీదగా సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వాలు దిగొచ్చే దాకా కొట్లాడుతం
‘శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు.. పోరాడితే పోయేదేం లేదు. బానిస సంకెళ్లు తప్ప అని.. బరాబర్ కొట్లాడాలే.. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది’ అని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఇదే భోరజ్‌లో గతంలో వంటావార్పు చేశామని, ఇప్పుడు మళ్లీ భోరజ్ దగ్గరే కూర్చుందామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చే దాకా కొట్లాడుదామని పిలుపునిచ్చారు. 21వ తారీఖున జోర్దార్గా రైతులంతా కదిలి రావాలని కోరారు. ఉద్యమ స్ఫూర్తితో రైతులు పోరాటాలు చేయాలని, ఆ స్ఫూర్తి రైతుల్లో తీసుకొచ్చేందుకే కేసీఆర్ తమను ఇక్కడికి పంపారని తెలిపారు. ‘ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు.. అవసరమైతే రెండు ప్రభుత్వాల మెడలు వంచాలె. ప్రభుత్వాల మెడలు వంచే దాకా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటది’ అని భరోసా ఇచ్చారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెస్తామన్న ప్రధాన మంత్రి పసల్ బీమా యోజనా ఏమైపోయిందో చెప్పాలె.. అధిక వర్షాలతో నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలె’ అని డిమాండ్ చేశారు.
‘బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఎత్తుకుపోయినోడికేమో ఏం పరీక్షలు ఉండవు.. వానికి లోన్లు ఇచ్చేప్పుడు ఏం అవసరం ఉండయ్.. కానీ రైతులు మాత్రం వేలి ముద్ర పెట్టాలె.. కాలిముద్ర పెట్టాలె.. తలరాత చూడాలె.. ఇవన్నీ చూసి కొనాలా? వద్దా? అని ఆలోచించాల్నా? పెద్ద మనుషులు, మహిళా రైతులకు బయోమెట్రిక్ పద్ధతి తీసివేసి, వాళ్ల కుటుంబ సభ్యులు పంట తీసుకొస్తే ఆధార్ లేదా రేషన్ కార్డులు చూసి కొనుగోలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రులు జోగు రామన్న, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్ నాయక్, మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం
మెట్పల్లి/మోర్తాడ్, నవంబర్18: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు జగిత్యాల జిల్లా మెట్పల్లి, నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పత్తి రైతుల సమస్యలపై ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తుండగా మార్గం మధ్యలో మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో కమ్మర్‌పల్లిలో మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు సాదరం స్వాగతం పలికారు. పటాకులు కాల్చి కేటీఆర్ కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు. కేటీఆర్‌తో కరచాలనం కోసం పోటీపడ్డారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన కేటీఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
నంబర్-1 పత్తి పెట్టుకొని దిగుమతా?
‘నేను, జోగు రామన్న మంత్రులుగా ఉన్నప్పుడు సౌత్ ఇండియా జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్స్ అసోయేషన్ వాళ్లు మా దగ్గరకు వచ్చి.. మొత్తం భారతదేశంలోనే పత్తి పండించే రాష్ర్టాల్లో బెతరిన్ పత్తి పండించేది మన తెలంగాణలోని ఆదిలాబాద్ రైతులు అని చెప్పిండ్రు. ఇది నేను చెప్పిన మాట కాదు. వాళ్లు చెప్తేనే నాకు తెలిసింది. పత్తి పండించే ముఖ్యమైన రాష్ర్టాలు గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కాటన్ క్వాలిటీ బాగుంటుందని చెప్రిండ్రు. కానీ పత్తి ఏరేటప్పుడు, ప్యాకింగ్ చేసేటప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది. దాన్ని కొద్దిగా మంచిగ చేసుకొని, మంచి బ్రాండింగ్ చేసుకోవాలని, అలా చేస్తే దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మన దగ్గరి నుంచి వస్తుందని చెప్పిండ్రు. బంగారం వంటి పత్తి మన రాష్ట్రంలో పండుతుండే.. ఇవాళ మోదీ బయటి నుంచి పత్తి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నరు. ఇన్ని కొర్రీలు పెట్టడం వెనుక కారణం బయట ఒప్పందం చేసుకొని రావడమే’ అని కేటీఆర్ తూర్పారబట్టారు.
మేము రైతులను కలుస్తామంటే భయమెందుకు?
‘ఈ రోజు మేం ఇక్కడికి వస్తున్నమని తెలిసి మార్కెట్‌ను బంద్ పెట్టిండ్రు. నిజంగానే మీరు ఏ తప్పూ చేయకుంటే.. అన్నీ సక్కగ చేస్తున్న మాట నిజమైతే.. రైతులు సంతోషంగా ఉన్నది నిజమైతే.. ఇవాళ ఏ కారణంతో మార్కెట్‌ను బంద్ పెట్టారో చెప్పాలి. నిజంగానే మీరు బ్రహ్మాండంగా నడుపుతుంటే రైతులకు ఏ షికాయత్ లేకుంటే.. మేం రైతులను కలుస్తున్నమంటే మీకు భయమెందుకు? మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలె’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాను ఆదిలాబాద్‌కు వస్తుంటే బోథ్ నియోజకవర్గంలోని లగ్గంపూర్లో సోయా కొనుగోలు కేంద్రంలో నారాయణరెడ్డి అనే పెద్దమనిషి తన బాధను చెప్పుకొన్నాడని తెలిపారు. ‘తాను 40 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న అన్నడు. మొదటిసారి సోయా రంగు మారిందని చెప్తున్నరు.. చెడిపోయిందని చెప్పి కొంటలేరు. గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడలేదని చెప్పిండు. జర మా కోసం కొట్లాడుండ్రి అని అడిగిండు. పక్కనే ఉన్న పత్తి రైతులు సార్ మా ఆదిలాబాద్‌లో ఇంటర్నెట్ సక్కగ ఉండదు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు.. ఉన్నోళ్లకు వాటిని వాడరాదు. అసోంటప్పుడు కిసాన్ కపాస్ యాప్ ఎట్లా వాడుతం? అది ఏం యాపో ఏందో? అందులోనే బుక్ చేసుకోవాలంటున్నరు.. దాని గురించి మాకు ఎట్ల తెలుస్తది? మాతోని ఎట్లయితది? మీరే జర సీసీఐ వాళ్లకు చెప్పండి అని బతిలాడిండ్రు’ అని కేటీఆర్ వివరించారు.
కేసీఆర్ ఉంటే.. ఇంత కష్టం ఉంటుండెనా?
ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నది. రైతు భరోసా ఇప్పటికే రెండుసార్లు ఎగ్గొట్టగా,
ఈ యాసంగి సాయం గురించి మాట కూడా మాట్లాడుతలేదు. రుణమాఫీ లేదు. నష్టపరిహారం లేదు. యూరియా లేదు. బోనస్ లేదు. పంట అమ్ముకుందామన్నా కొనే దిక్కులేదు. కేసీఆరే ఉంటే.. తెలంగాణ రైతుకు ఇంత కష్టం ఉంటుండెనా?
– జనార్దన్ (రైతు), కుచులాపూర్, అదిలాబాద్ జిల్లా
పంటకొనే దిక్కులేక రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరిస్తున్నయి. అటు కేంద్ర ప్రభుత్వం మన దగ్గర పండే పత్తిని కాదని విదేశాల నుంచి దిగుమతి చేసుకుందామని చూస్తున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు, రాజకీయాలు తప్ప రైతులపై పట్టింపులేదు. వీళ్లు అడిగేది లేదు.. వాళ్లు ఇచ్చేది లేదు.. యూరియా కావాలని ఈయన అడగలే.. ఆయన ఇవ్వలే. పంట కొనుమని వీళ్లు అడగరు.. ఆయన కొనడు.
-కేటీఆర్
ఎన్నికలకు ముందు సోయాకు, పత్తికి, వడ్లకు బోనస్ ఇస్తా అన్నడు. మరి ఎవ్వరికన్నా బోనస్ డబ్బులు వచ్చినయా? బోనస్ బోగసైంది. రుణమాఫీ కాదు.. రైతుబంధు రాదు.. కరెంట్ ఉండదు.. ఆఖరికి రైతులు కష్టపడి పండించిన పంటను కొనేటోడు లేడు. అందుకే ఒక్కటి యాది పెట్టుకోండ్రి. రైతు మీద కడుపులో ప్రేమ ఉండి, రైతు అంటే గుండెల నిండా అభిమానం ఉన్నోడు నాయకుడైతేనే రాష్ట్రం బాగుంటదితప్ప ఇసొంటోళ్లతోని కాదు.
-కేటీఆర్