హైదరాబాద్ : భారతదేశ చరిత్రలోనే అత్యంత కుసంస్కార పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలోని చెన్నంబావికి చెందిన సర్పంచ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ స్వయంగా కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ ప్రభుత్వమైనా.. చెక్‌డ్యామ్‌లు కట్టాలి, చెరువులు కట్టాలి, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి ఆలోచిస్తుందని, చెరువులు, చెక్‌డ్యామ్‌లను పేల్చేయాలని చూడదని అన్నారు. కానీ రాష్ట్రంలో అధకారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం.. మేడిగడ్డను కూల్చాలి, చెరువులను పేల్చేయాలి, చెక్‌డ్యామ్‌లను పేల్చేయాలి అని చూస్తోందని విమర్శించారు.
ప్రజల మేలును పక్కనపెట్టి రాజకీయంగా లాభపడాలని చూసే అత్యంత కుసంస్కారమైన పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చివేతలే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో దివ్యాంగుల కాలనీ కూల్చివేతతో వీళ్ల కూల్చివేతలు మొదలయ్యాయని గుర్తుచేశారు.