KTR | ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో.. సావుకు పోతున్నావో.. తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్.. 28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యత అని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చింది లేదని తెలిపారు.
ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. ఈడీ చేసిన దాడులు కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్ళు పట్టుకుని తప్పించుకున్నారో అని వ్యాఖ్యానించారు. మీ బడెబాయ్ – చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టలదొరా అని అన్నారు. పోరాటం మా తెలంగాణ రక్తంలో ఉందని తెలిపారు. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదని స్పష్టం చేశారు.
పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది అని రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ప్రయత్నించి పట్టుబడిన ఓటుకునోటు చరిత్ర నీది అని విమర్శించారు. కానీ మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి అని స్పష్టం చేశారు.