BRS Working President KTR | పద్మ అవార్డులను దక్కించుకున్న ప్రముఖులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. అణగారిన వర్గాల ధిక్కారానికి ప్రతీకగా నిలిచి తన రాజీలేని మనస్తత్వంతో సామాజిక న్యాయ సాధన కోసం అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న పోరాట యోధులు మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు రావడం ఆయావర్గాలకు దక్కిన గౌరవం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డు లభించడం తెలుగు వారందరికీ గర్వకారణం అని వ్యాఖ్యానించారు. వైద్య రంగంలో డాక్టర్ నాగేశ్వర్రెడ్డి చేస్తున్న కృషి అనితర సాధ్యమైనదన్నారు.
ఒక నటుడిగా మాత్రమే కాకుండా, లక్షలాది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న హీరో నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం హర్షణీయం అని తెలిపారు.తమ ప్రతిభ, పట్టుదలతో సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న ఈ ప్రముఖులను పౌర పురస్కారాలతో గౌరవించుకోవడం అంటే మనల్ని మనం సత్కరించుకోవడమేనని చెప్పారు.